న్యూఢిల్లీ, డిసెంబర్ 28: మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఆదర్శ ప్రస్థానం ముగిసింది. ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్లో శనివారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. కేంద్రం అధికార లాంఛనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికింది. మన్మోహన్ పెద్ద కూతురు ఉపిందర్ సింగ్ తన తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, భూటాన్ రాజు జిగ్మె ఖేసర్ నామ్గ్యల్ వాంగ్చుక్, మారిషస్ విదేశాంగ మంత్రి ధనంజయ్ రామ్ఫల్, త్రివిధ దళాధిపతులు తదితరులు మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.
సిక్కు మతాచారం ప్రకారం జరిగిన అంత్యక్రియల్లో సాయుధ బలగాలు గాల్లోకి కాల్పులు జరిపి మాజీ ప్రధానికి గౌరవ వందనం సమర్పించాయి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి నిగమ్బోధ్ ఘాట్ వరకు ‘మన్మోహన్ సింగ్ అమర్ రహే’ నినాదాలతో హోరెత్తుతూ ఆయన అంతిమయాత్ర సాగింది. ఏఐసీసీ కార్యాలయంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనకు నివాళులర్పించారు. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి, సుఖ్విందర్ సింగ్ సుఖు, ఆతిశీ తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు.
మన్మోహన్ సింగ్కు ఢిల్లీలో స్మారకాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనువైన స్థలాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని పేర్కొన్నది. కాగా, స్మారక నిర్మాణం జరగనున్న స్థలంలోనే అంత్యక్రియలు జరపాలని అంతకుముందు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మన్మోహన్ అంత్యక్రియలు, స్మారకానికి స్థలాన్ని నిర్ణయించకుండా బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దేశ తొలి సిక్కు ప్రధానమంత్రిని అవమానిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు దేశాధినేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలను, ప్రతిభను కొనియాడారు. భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొ న్నారు. ఆయన నిజమైన పెద్ద మనిషి, వక్త అని వ్యాఖ్యానించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషించారని ఐక్య రాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. న్యూఢిల్లీలో పాలస్తీనా దౌత్య కార్యాలయం ఏర్పాటుకు మన్మోహన్ మద్దతుగా నిలిచారని పాలస్తీనా దౌత్యవేత్త అబెద్ ఎల్రజెగ్ అబు జజెర్ గుర్తు చేసుకున్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భూటాన్ ఘనంగా నివాళులర్పించింది. శుక్రవారం ఆ దేశ రాజధాని థింపులోని బౌద్ధ క్షేత్రంలో మన్మోహన్ ఆత్మ శాంతి కోసం జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నమ్జియెల్ వాంగ్చుక్ పాల్గొన్నారు. మరోవైపు మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా శనివారం సూర్యాస్తమయం వరకు జాతీయ జెండాలను అవనతం చేయాలని మారిషస్ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను ఆదేశించింది.