Pahalgam attack : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) లో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో ఒకడు పాకిస్థాన్ (Pakisthan) మాజీ సైనికుడని తెలిసింది. హషీమ్ మూసా (Hashim Musa) అనే ఉగ్రవాది గతంలో పాకిస్థాన్ సైన్యంలోని ప్రత్యేక దళంలో పారా కమాండోగా పనిచేశాడని దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం అతడు కరుడుగట్టిన టెర్రరిస్టుగా మారినట్లు దర్యాప్తు బృందాలు తెలిపాయి. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబాతో కలిసి అతడు పని చేస్తున్నట్లు వెల్లడించాయి. లష్కరే తోయిబా సూత్రధారులే మూసాను కశ్మీర్‌కు పంపినట్లు తెలిపాయి.
ఇప్పటికే ఉగ్రవాదులకు అనుకూలంగా పని చేస్తున్నారన్న అనుమానంతో భారత సైన్యం వందల మంది స్థానికులను అదుపులోకి తీసుకొంది. వారిలో 15 మంది టెర్రిరిజం ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ మూసాకు ఉన్న సైనిక నేపథ్యాన్ని ధ్రువీకరించారని అధికారులు వెల్లడించారు. ‘హిషిమ్ మూసా పాకిస్థాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి లష్కరేలోకి సహాయకారిగా వచ్చినట్లు తెలిసింది’ అని దర్యాప్తు బృందానికి చెందిన ఓ అధికారి మీడియాతో అన్నారు. ఉగ్రవాదులకు, పాకిస్థాన్ సైన్యానికి మధ్య ఉన్న సంబంధాలకు ఇది నిదర్శనమని చెప్పారు.
కాగా పాకిస్థాన్ పారా కమాండోలు అత్యాధునిక శిక్షణ పొందుతున్నారు. వీరు సంప్రదాయేతర యుద్ధతంత్రం, కోవర్ట్ ఆపరేషన్లలో దిట్టలు. శిక్షణ సమయంలోనే వీరిని మానసికంగా, శారీరకంగా బలోపేతం చేస్తారు. దాంతోపాటు యుద్ధరంగంలో ఎత్తుగడలు నేర్పిస్తారు. అత్యాధునిక ఆయుధాల వినియోగంలోను, నేరుగా చేతులతో పోరాడటంలోను వాళ్లు నిపుణులు. పహల్గాం దాడిలో పాల్గొన్న వారిలో కొందరు గతంలో గగన్‌నగర్, గండేర్బల్ అడవుల్లో ఆరుగురు స్థానికేతరులు, ఒక డాక్టర్‌ను, ఇద్దరు సైనిక పోర్టర్లను హత్య చేసిన ఘటనల్లోనూ పాల్గొన్నారు. హషిమ్ మూసా మాత్రం ఈ మూడు దాడుల్లోను పాల్గొన్నాడు. ఇక జునైద్‌భట్, అర్బాజ్ మిర్ కూడా పాకిస్థాన్‌లో శిక్షణ పొందినట్లు గుర్తించారు.
పహల్గాంకు చేరుకునేందుకు ఉగ్రవాదులు దాదాపు 22 గంటలపాటు ట్రెక్కింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ ప్రణాళికను అమలుచేసేందుకు కోకెర్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయ వరకు కాలి నడకన వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఉగ్రవాదులు సైనిక శిక్షణ పొందారనడానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఈ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత సైన్యం ముమ్మరంగా వేటాడుతోంది. వాళ్లు భద్రతా దళాల నుంచి నాలుగుసార్లు త్రుటిలో తప్పించుకున్నారు. త్వరలోనే వాళ్ల కథ ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు.