హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఢిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టయిన ఆప్ నేత మనీశ్ సిసోడియాకు బెయిల్ లభించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. 17 నెలలుగా మనీశ్ సిసోడియా జైల్లో ఉన్నారని, ఇప్పటివరకూ ఆయనపై మోపిన నేరాభియోగాలను దర్యాప్తు సంస్థలు రుజువు చేయలేకపోయాయని అన్నారు. నేరం రుజువు కాకుండా దర్యాప్తు పేరుతో ఏండ్లకు ఏండ్లు వ్యక్తులను జైల్లో పెట్టడం సరికాదని, దర్యాప్తు ప్రక్రియను వేగంగా ముగించి నిర్దోషులను వదిలేయాలని పేర్కొన్నారు. ఇదొక్క ఢిల్లీ మద్యం కేసు గురించే కాదని.. దేశంలోని అన్ని కేసులకూ ఇది వర్తిస్తుందని అన్నారు. ‘జస్టిస్ డిలేయిడ్ ఈజ్ జస్టిస్ డినైయిడ్’ అని, ఏండ్లకు ఏండ్లు జైల్లో పెట్టి చివరకు నిర్దోషి అని విడుదల చేస్తే ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ లు తమ దర్యాప్తు ప్రక్రియకు కాలపరిమితిని నిర్దేశించుకోవాలని, న్యాయస్థానాలు కూడా కాలపరిమితిని నిర్ధారించి, నిర్దోషులకు ఉపశమనం కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
సిసోడియాకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఇదే కేసులో తన సోదరి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ మద్యం కేసులో కవితను అరెస్టు చేయడం కేవలం రాజకీయ ప్రేరేపితమేనని కేటీఆర్ ఆరోపించారు. కవిత బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, సోమవారం లేదా మంగళవారం ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించే అవకాశం ఉందన్నారు. కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌లకు కూడా త్వరలోనే బెయిల్ వస్తుందని భావిస్తున్నామని, వీరు కూడా అరెస్టు అయ్యి సుదీర్ఘకాలం అవుతున్నదని అన్నారు.
తాను ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లానని, కవితతో ములాఖాత్ అయ్యానని కేటీఆర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయిదు నెలల్లో కవిత 11 కిలోల బరువు తగ్గారని, బీపీతో బాధపడుతున్నారని, ఇతర అరోగ్య ఇబ్బందులు కూడా ఉన్నాయని అన్నారు.