భోపాల్, డిసెంబర్ 12 : మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్‌ను ఎంపికచేస్తూ బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఆ పార్టీలో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మధ్యప్రదేశ్ సీఎంగా అత్యంత సుదర్ఘీకాలం పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్, మంగళవారం అందరికీ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా భోపాల్‌లోని సీఎం నివాసంలో జరిగిన వీడ్కోలు సమావేశంలో చౌహాన్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన్ని కలిసిన బీజేపీ మహిళా కార్యకర్తలు భోరుమని విలపించారు.
ఈ సందర్భంగా చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ, తన కోసం ఇది కావాలని పార్టీ అధిష్ఠానాన్ని అడగటం కన్నా చావటం మేలని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సీఎంగా మోహన్ యాదవ్‌ను ఎంపిక చేస్తూ బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తున్నానని చెప్పారు. కొత్త సీఎంకు అన్ని విధాలుగా సహకరిస్తానని పేర్కొన్నారు. అత్యంత సుదీర్ఘ కాలంపాటు రాష్ట్ర సీఎంగా శివరాజ్ సింగ్ చరిత్ర సృష్టించారు. 2005 నుంచి 2018వరకు, ఆ తర్వాత 2020 నుంచి 2023 వరకు సీఎంగా ఉన్నారు.