న్యూఢిల్లీ: ఇటలీ మాజీ ప్రధాని, కోటీశ్వరుడైన వ్యాపారవేత్త సిల్వియో బెర్లుస్కోనీ (86) ఇక లేరు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. బెర్లూస్కోనీకి కొన్నేళ్ల క్రితం ల్యుకేమియా వ్యాధి సోకింది. దానికితోడు ఇటీవల ఊపిరితిత్తులకు కూడా ఇన్ఫెక్షన్ సోకి ముదరడంతో ఆయన తట్టుకోలేకపోయారు. వ్యాధులతో పోరాడుతూనే ఇవాళ తుదిశ్వాస విడిచారు.
రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్త అయిన బెర్లుస్కోనీ ఇటలీ చరిత్రలోనే అతిపెద్దదైన మీడియా సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత ఫోర్జా ఇటాలియా అనే పార్టీని స్థాపించి దేశ ప్రధాని అయ్యారు. ఇప్పుడు కూడా ఆయన పార్టీ ప్రస్తుత ప్రధాని జార్జియా మెలోని వామపక్ష సంకీర్ణ సర్కారులో భాగస్వామిగా ఉన్నది. అయితే ప్రభుత్వంలోనే బెర్లుస్కోనీ ఎలాంటి పదవిలో లేరు. ఇదిలావుంటే బెర్లూస్కోనీ మరణం రాబోయే రోజుల్లో ఇటలీలో రాజకీయ అస్థిరతకు దారితీస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.