న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నివసించడం కోసం కేటాయించే అధికారిక బంగళా నుంచి విశ్రాంత సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు పరిపాలనా యంత్రాంగం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అనుమతించిన గడువుకు మించి జస్టిస్ చంద్రచూడ్ కృష్ణ మీనన్ మార్గ్‌లోని నెం.5 బంగళాలో నివసిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయమైన కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖకు ఈ నెల 1న ఈ లేఖను పంపించింది. ఆయనకు ఇచ్చిన గడువు మే 31తో ముగిసినట్లు పేర్కొంది. సుప్రీంకోర్టు జడ్జస్ (అమెండ్మెంట్) రూల్స్, 2022లోని రూల్ 3బీ ప్రకారం పదవీ విరమణ చేసిన సీజేఐ టైప్ 7 బంగళాను గరిష్ఠంగా ఆరు నెలల వరకు మాత్రమే తన స్వాధీనంలో ఉంచుకోవచ్చునని తెలిపింది.
ఈ గడువు మే 10తో ముగిసిందని చెప్పింది. అయితే నిబంధనల ప్రకారం తనకు తుగ్లక్ రోడ్‌లోని నెం.14 బంగళాను కేటాయించినప్పటికీ, దానిలో ఆధునికీకరణ పనులు పూర్తి కాలేదని మరింత గడువు ఇవ్వాలని జస్టిస్ చంద్రచూడ్ నాటి సీజేఐ ఖన్నాను కోరారు. దానికి జస్టిస్ ఖన్నా ఆమోదం తెలిపారు. ఆ తర్వాత మే 31 వరకు గడువును పొడిగించాలని చంద్రచూడ్ మళ్లీ ఖన్నాను మౌఖికంగా కోరారు. కూతుళ్ల చికిత్స ఉండడంతో జూన్ 30 వరకు గడువు పొడిగించాలని ఆయన కోరారు.
జస్టిస్ చంద్రచూడ్ ఆదివారం సీఎన్ఎన్ న్యూస్ 18తో మాట్లాడుతూ, ప్రభుత్వం తనకు కేటాయించిన ఇంటికి అనేక మరమ్మతులు చేయవలసి వచ్చిందని చెప్పారు. మరమ్మతులు పూర్తి కావడం కోసం ఎదురు చూస్తున్నామని, అవి పూర్తయిన మర్నాడే ఆ ఇంటికి మారిపోతామని చెప్పారు. సామాన్లను సర్దడం పూర్తయిందన్నారు. తమ కుమార్తెలు దివ్యాంగులు అయినందువల్ల ప్రత్యేక సదుపాయాలు గల ఇల్లు అవసరమని ఆయన తెలిపారు.