న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ సమయంలో.. పాకిస్థాన్‌లోని కిరాణా హిల్స్‌లో ఉన్న న్యూక్లియర్ సైట్‌ను తాము టార్గెట్ చేయలేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మాజీ జనరల్ అనిల్ చౌహాన్(Anil Chauhan) తెలిపారు. కిరాణా హిల్స్ పాకిస్థాన్‌కు చెందిన అణ్వస్త్ర కేంద్రాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ కొండ ప్రాంతాల్లో లాయిటరింగ్ మ్యునిషన్ ఏదైనా అనుకోకుండా ఢీకొని ఉంటుందని అనిల్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ సిందూర్ .. ఆ తదనంతరం అన్న అంశంపై చౌహాన్ మాట్లాడారు. సర్గోదాలో ఉన్న టార్గెట్లను పేల్చేందుకు లాయిటరింగ్ మ్యునిషన్స్ను మోహరించామని, అయితే ప్రొపల్షన్ సామర్థ్యం తగ్గడం వల్ల బహుశా ఏదైనా డ్రోన్ ఆ కొండల్ని ఢీకొని ఉంటుందని ఆయన అన్నారు. తాము కిరాణా హిల్స్‌ను టార్గెట్ చేయలేదని, అక్కడ ఏం ఉందో కూడా తమకు తెలియదని గతంలో డీజీఏఓ ఎయిర్ మార్షల్ ఏకే భారతి పేర్కొన్న విషయాన్ని అనిల్ చౌహాన్ సమర్థించారు.
పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లో ఉన్న 9 ఉగ్ర కేంద్రాలను భారత్ పేల్చివేసింది. 2005లో జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో సుమారు 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఈ ఆపరేషన్‌లో భాగంగా సర్గోదా ఎయిర్‌బేస్‌ను ఇండియా టార్గెట్ చేసింది. కానీ కిరాణా హిల్స్ ఏరియాలో ఉన్న అండర్‌గ్రౌండ్ న్యూక్లియర్ స్టోరేజ్ ఫెసిలిటీతో ఆ ఎయిర్‌బేస్‌కు లింకు ఉన్నట్లు ఆ తర్వాత వెల్లడైంది. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని, కానీ ఆ ఆపరేషన్‌కు చెందిన ప్రధాన దశలు పూర్తి అయినట్లు జనరల్ చౌహాన్ చెప్పారు. గత ఏడాది ఏప్రిల్ 29వ తేదీన ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన మీటింగ్‌కు చెందిన కీలక అంశాలను కూడా ఆయన వెల్లడించారు.
పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పాలని, ఊహించని రీతిలో చర్యలు తీసుకోవాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని సహించేది లేదని మోదీ తమకు చెప్పినట్లు జనరల్ చౌహాన్ పేర్కొన్నారు. మీరు సమయం తీసుకుని ఆపరేషన్ చేపట్టాలని, కానీ వైఫల్యం ఉండకూడదని ఆయన అన్నారు. ఆపరేషన్ సక్సెస్ అయినట్లు భారత్ వద్ద ఆధారాలు కూడా ఉండాలని మోదీ చెప్పినట్లు గుర్తు చేశారు. బహవల్‌పుర్‌లో ఉన్న టార్గెట్‌ను పేల్చేందుకు ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిపారు. పౌరులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రాత్రిపూట దాడి చేసినట్లు చెప్పారు.