గోరఖ్‌పూర్, డిసెంబర్ 14: ప్రపంచ వ్యాప్తంగా మన యోగాకు ఎంతో పేరు వచ్చిందని, అదే తరహాలో ఆయుర్వేద ఔషధాలకు కూడా ప్రాచుర్యం కల్పించాలని డీఆర్డీవో మాజీ చైర్మన్ జీ సతీశ్ రెడ్డి అన్నారు. గోరఖ్‌పూర్‌లోని మహాయోగి గోరఖ్‌నాథ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘సహజ ఉత్పత్తుల నుంచి ఔషధాల తయారీలో పరిశోధనలు, అవకాశాలు, అభివృద్ధి’ అనే అంశంపై జరిగిన జాతీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
సహజ సిద్ధ ఔషధాలు దేశానికి ఎంతో అవసరమని అన్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువుల నుంచి ఔషధాల తయారీపై విస్తృతంగా పరిశోధనలు జరగాలన్నారు. ప్రధాని ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్‌లో ఆయుర్వేదాన్ని భాగస్వామిని చేసేందుకు విస్తృతమైన అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొవిడ్ సమయంలో మహమ్మారిపై పోరాటంలో డీఆర్డీవో చైర్మన్‌గా సతీష్ రెడ్డి చేసిన కృషిని ప్రశంసించారు.