చెన్నై: బీజేపీ నేత కే అన్నామళై(K Annamalai).. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. శుక్రవారం రిలీజైన బీజేపీ జాబితాలో ఆయన పేరు లేదు. తానేమీ ఎన్నికల రేసులో లేనట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఇంచార్జ్.. పీయూష్ గోయల్‌కు కూడా వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 23వ తేదీన జరగనున్న ఎన్నికల్లో తానేమీ పోటీ చేయడం లేదని బీజేపీ తమిళనాడు మాజీ చీఫ్ అన్నామలై వెల్లడించారు. ఒకవేళ కావాలనుకుంటే తాను ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసేవాడినన్నారు. కానీ ఇప్పుడు కేవలం బీజేపీ, ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు కోసం మాత్రమే పనిచేయనున్నట్లు చెప్పారు. తమిళనాడులో ప్రచారం నిర్వహించడమే తన పాత్ర అని తెలిపారు. పుదుచ్చరి, కేరళలో ఏప్రిల్ 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి, అప్పటి వరకు ఆ రాష్ట్రాల్లో, ఆ తర్వాత తమిళనాడులో తాను ప్రచారం చేయనున్నట్లు వెల్లడించారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించనున్నట్లు పేర్కొన్నారు.