న్యూఢిల్లీ/పాట్నా, జనవరి 23: బీహార్ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరీ ఠాకూర్(1924-1988)కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఆయన శత జయంతి వేళ దేశ అత్యున్నత పురస్కారానికి ఆయనను ఎంపిక చేసినట్టు మంగళవారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం కర్పూరీ ఠాకూర్ చేసిన కృషికి గుర్తుగా ఆయనకు ఆ పురస్కారం ఇస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది.
1970వ దశకంలో రెండు సార్లు బీహార్ సీఎంగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్.. జననాయక్(జననేత)గా గుర్తింపుపొందారు. రాజకీయంగా అగ్రకులాలు ఆధిపత్యం వహించే బీహార్‌లో ఓబీసీల రాజకీయాలకు ఆయన నాందిపలికారు. మొదటిసారిగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్సేతర సోషలిస్టు నాయకుడు కూడా కర్పూరి ఠాకూరే కావడం విశేషం. భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్న గ్రహీతల్లో ఠాకూర్ 49వ వ్యక్తి. చివరిసారిగా కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్ ముఖర్జీకి 2019లో ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకు
1924, జనవరి 24న కర్పూరి ఠాకూర్ నాయీ బ్రాహ్మణ కమ్యూనిటీలో జన్మించారు. 1970లో బీహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించిన సీఎంగా ఠాకూర్ గుర్తింపు పొందారు. కర్పూరి ఠాకూర్ జన్మించిన సమస్తిపూర్ జిల్లాలోని గ్రామం పేరును ఆయన మరణాంతరం కర్పూరి గ్రామంగా మార్చారు. యుక్త వయసులో స్వాతంత్య్ర ఉద్యమం వైపు కర్పూరి మళ్లారు. 1942-1945 మధ్య క్విట్ ఇండియా ఉద్యమంలో అరస్టై కొన్ని నెలల పాటు జైలు జీవితం గడిపారు. 1952లో తొలిసారిగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజ్‌పూర్ నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 1967-68 మధ్య రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా సేవలందించారు.
బీహార్‌లో రిజర్వేషన్ల అమలుకు ఆద్యుడు
స్వాతంత్య్రం అనంతరం భారతదేశంలో సోషలిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించిన రామ్ మనోహర్ లోహియా వంటి వ్యక్తుల నుంచి కర్పూరి ఠాకూర్ స్ఫూర్తి పొందారు. కర్పూరికి జయప్రకాశ్ నారాయణకు సన్నిహితుడిగా పేరున్నది. తొలి విడతలో సోషలిస్టు పార్టీ నుంచి సీఎంగా చేసిన ఠాకూర్.. రెండో టర్మ్‌లో జనతా పార్టీ సీఎంగా పనిచేశారు. మండల్ కమిషన్‌కు ముందుదిగా భావించే ముంగేరి లాల్ కమిషన్ సిఫారసులను(రాష్ట్రంలో బలహీనవర్గాలకు రిజర్వేషన్లు) అమలు చేసిన సీఎంగా ఠాకూర్ కాలాన్ని ప్రముఖంగా గుర్తుంటుంది. వ్యక్తిగతంగా నిరాడంబరంగా ఉన్న కర్పూరి ఠాకూర్ ఎంతో మందికి స్ఫూర్తి అని, భారత రాజకీయాల్లో ఆయన భాగస్వామ్యం చెరగని ముద్ర అని చెబుతుంటారు.
లాలూ, నితీశ్, పాశ్వాన్లకు గురువు
బీహార్‌లో ఓబీసీ రాజకీయాలకు పునాది వేసిన వారిలో కర్పూరి ఠాకూర్ ప్రథములు. జయప్రకాశ్ నారాయణ్ ఇచ్చిన పిలుపుతో ఎంతో మంది ఉద్యమంలోకి రాగా.. అలా వచ్చిన వారిలో లాలూప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్, రాంవిలాస్ పాశ్వాన్ వంటి నేతలకు ఠాకూర్ రాజకీయ గురువు. గొప్ప రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందిన కర్పూరి ఠాకూర్ 1988, ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు.
కర్పూరి జీవితం స్ఫూర్తిదాయకం
అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి, సమానత్వం, సాధికారత కోసం కర్పూరి ఠాకూర్ తిరుగులేని నిబద్ధతతో పనిచేశారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. విజనరీ నాయకత్వం ద్వారా దేశ సామాజిక-రాజకీయ నిర్మాణంలో ఆయన చెరగని ముద్ర వేశారు. సమ, న్యాయమైన సమాజం కోసం ఆయన చేసిన కృషిని కొనసాగిస్తాం.
– నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఏండ్ల డిమాండ్ నేటికి నెరవేరింది..
కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న పురస్కారం ప్రకటన సంతోషకరం. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వాలని మా పార్టీ ఏండ్లుగా చేస్తున్న డిమాండ్ నేటికి నెరవేరింది. దళితులు, వెనుకబడిన వర్గాలు సహా సమాజంలోని అన్ని అణగారిన వర్గాలకు ఇది ఒక సానుకూల సందేశం పంపుతుంది.
– నితీశ్ కుమార్, బీహార్ సీఎం