Tamim Iqbal : బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ (Bangladesh Former Captain ) తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) గుండెపోటుతో ఆస్పత్రి పాలయ్యారు. ఢాకా ప్రీమియర్ లీగ్ (DPL) లో మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ (Mohammedan Sporting Club) టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తమీమ్ ఇక్బాల్.. సోమవారం సావర్‌లో షైన్‌పుకూర్ క్రికెట్ క్లబ్ (Shinepukur Cricket Club) తో మ్యాచ్ సందర్భంగా ఛాతిలో నొప్పితో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దాంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. గుండెలో ఒక వాల్ బ్లాక్ అయ్యిందని, స్టెంట్ వేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. మ్యాచ్ ఆడుతుండగా తమీమ్ ఇక్బాల్ ఛాతిలో నొప్పితో తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడని, మైదానంలో ప్రాథమిక చికిత్స అనంతరం అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజీషియన్ దేవాశిష్ చౌధరి చెప్పారు.
ముందుగా ఆస్పత్రికి తరలించినప్పుడు పరీక్షలు చేయగా చిన్న సమస్య ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యిందని, దాంతో తమీమ్ తనను ఢాకాకు తీసుకెళ్లాలని పట్టుబట్టడంతో అంబులెన్స్‌లో మ్యాచ్ జరుగుతున్న మైదానానికి తరలించారని, అయితే మైదానానికి చేరుకోగానే మరోసారి ఛాతిలో నొప్పి రావడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారని, మరోసారి పరీక్షలు చేయగా అతడికి గుండెలో బ్లాక్ ఉన్నట్లు తేలిందని చౌధరి తెలిపారు.