ఉదకమండలం: అణుశక్తి కమిషన్ మాజీ చైర్మన్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ) మాజీ కార్యదర్శి డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్ (95) కన్నుమూశారు. దేశ అణు ఇంధన కార్యక్రమంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్ మంగళవారం తమిళనాడులోని ఉదకమండలంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. 1955 సెప్టెంబర్‌లో డీఏఈలో చేరిన డాక్టర్ శ్రీనివాసన్.. భారత అణు కార్యక్రమ పితామహుడు డాక్టర్ హోమీ బాబాతో కలిసి కెరీర్‌ను ప్రారంభించారు. వీరిద్దరు కలిసి దేశ తొలి అణు పరిశోధన రియాక్టర్ ‘అప్సర’ నిర్మాణంలో పాలుపంచుకున్నారు.
1959లో భారత తొలి అణు విద్యుత్తు కేంద్ర నిర్మాణానికి ప్రిన్సిపల్ ప్రాజెక్టు ఇంజినీర్‌గా నియమితులైన డాక్టర్ శ్రీనివాసన్.. 1967లో మద్రాస్ అణు విద్యుత్తు కేంద్రం (మ్యాప్స్) చీఫ్ ప్రాజెక్టు ఇంజినీర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆప్పట్లో ఆయన నాయకత్వంలోనే దేశ అణు కార్యక్రమం రూపుదిద్దుకోవడం మొదలైంది. ఆ తర్వాత జాతీయ ప్రాధాన్యమున్న అనేక పదవులను చేపట్టిన డాక్టర్ శ్రీనివాసన్.. 1987లో అణుశక్తి కమిషన్ చైర్మన్‌గా, డీఏఈ కార్యదర్శిగా, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) వ్యవస్థాపక చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన నాయకత్వంలో అభివృద్ధి చేసిన 18 న్యూక్లియర్ పవర్ యూనిట్లలో ఇప్పటివరకు 7 కార్యరూపం దాల్చి పనిచేస్తున్నాయి. మరో 7 యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయి.