Prashant Kishor : బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly elections) లో ఓటమి చవిచూసిన పార్టీలు ఇప్పుడు అందుకు కారణాలను విశ్లేషించుకుంటున్నాయి. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ‘జన్ సురాజ్ (Jan Suraaj)’ పార్టీ ఖాతా కూడా తెరవకుండానే ఘోర వైఫల్యాన్ని చవిచూడటంపై ఆయన తొలిసారి స్పందించారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిజాయితీగా తాము చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, పార్టీ ఓటమికి తాను పూర్తి బాధ్యత వహిస్తున్నానని చెప్పారు.
తప్పులను సరిచేసుకుని మరింత బలంగా ముందుకు వస్తామని, వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. తమవైపు నుంచి చాలా పాజిటివ్‌గా పనిచేశామని, కానీ ఎక్కడో పొరపాటు జరిగిందని అన్నారు. ప్రభుత్వాన్ని మార్చడంలో తాము విఫలమయ్యామని, ప్రజలను అర్ధం చేసుకోవడంలో కూడా విఫలమైనందుకు తానే బాధ్యత తీసుకుంటున్నానని చెప్పారు. ఆత్మపరిశీలన చేసుకుంటానని, తాను ఒకరోజు మౌనవ్రతం పాటిస్తున్నానని అన్నారు.
తాము పొరపాట్లు చేసి ఉండవచ్చుననీ, కానీ ఎలాంటి నేరం చేయలేదని, ఓట్లు సాధించలేకపోవడం నేరం కాదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. తాము కుల రాజకీయాలకు పాల్పడలేదని, హిందూ-ముస్లింలకు చిచ్చుపెట్టే మాటలు చెప్పలేదని, విష ప్రచారం సాగించలేదని, పేదలు, అమాయక ప్రజల ఓట్లు కొనుగోలు చేయడమనే నేరానికి పాల్పడలేదని ఆయన వ్యాఖ్యానించారు. అవన్నీ చేసినవాళ్లు అందుకు తగిన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు.
అభిమన్యుడిని యుద్ధంలో చంపినా మహాభారతంలో వారికి విజయం దక్కలేదని, న్యాయం వైపు ఉన్నవారే గెలిచారని, విజయం మావైపే ఉందని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రభుత్వం ప్రజల కోసం రూ.40 వేల కోట్లు ఖర్చుచేస్తామని ప్రకటించడం ఇదే మొదటిసారని, ఆ కారణంగానే ఎన్డీయే విజయం సాధించిందని అన్నారు.
ప్రతీ నియోజకవర్గంలోనూ కనీసం 60,000 నుంచి 62,000 మందికి రూ.10 వేల చొప్పున ఇచ్చారని, అంతేగాక రూ.2 లక్షల చొప్పున రుణాలు ఇస్తామని వాగ్దానం చేశారని ప్రశాంత్ కిషోర్ గుర్తుచేశారు. ఎన్డీయే అధికారంలోకి వస్తేనే లోన్లు వస్తాయని విధి నిర్వహణలో ఉన్న అధికారులు ప్రచారం చేశారని ఆరోపించారు. జీవికా దీదీలకు ప్రచార బాధ్యతలు అప్పగించారని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.