ముంబై: ఫోర్జరీ కేసులో నిందితుడైన వ్యక్తి కోర్టును బురిడీ కొట్టించాడు. ఏకంగా జడ్జి సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. (Accused Forges Judge’s Signature) అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ పొందాడు. అయితే న్యాయమూర్తి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తేలింది. దీంతో ముందస్తు బెయిల్‌ను రద్దు చేశారు. పరారీలో ఉన్న ఆ వ్యక్తిపై మరో కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. పేటెంట్ పొందిన డ్రాయింగ్లు, డిజైన్లను చెన్నైకి చెందిన ఒక కంపెనీ దుర్వినియోగం చేసిందని సీటీఆర్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 2022లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో ఆ సంస్థలోని పనిచేసిన హరిభౌ చెమ్టే పేటెంట్ డిజైన్లను చోరీ చేయడంతోపాటు ఫోర్జరీకి పాల్పడినట్లు దర్యాప్తులో తెలిసింది. దీంతో అతడితోపాటు మరికొందరిపై ఫోర్జరీ, కాపీ రైట్ ఉల్లంఘన కింద కేసు నమోదైంది.
కాగా, పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా మందస్తు బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టులో హరిభౌ దాఖలు చేశాడు. ఆ పిటిషన్‌పై విచారణ పెండింగ్ ఉండగా మరో కుట్రకు పాల్పడ్డాడు. ఈ ఏడాది జనవరిలో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) సంతకాన్ని అతడు ఫోర్జరీ చేశాడు. చేతితో రాసి ఉన్న ఆ జడ్జి ఉత్తర్వును బాంబే హైకోర్టుకు సమర్పించాడు. దీంతో జనవరి 17న బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నాటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు.
మరోవైపు ఫోర్జరీ కేసు నిందితుడైన హరిభౌ చెమ్టేకు ముందస్తు బెయిల్ మంజూరు కావడంపై అతడిపై ఫిర్యాదు చేసిన సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. దీంతో అతడు హైకోర్టుకు సమర్పించిన ఉత్తర్వు కాపీని పరిశీలించింది. అందులో ఉన్న జడ్జి సంతకాన్ని అతడు ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించింది. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో హరిభౌకు మంజూరు చేసిన మందస్తు బెయిల్‌ను కోర్టు రద్దు చేసింది. ఈ మోసంపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న హరిభౌపై మరో ఫోర్జరీతోపాటు చీటింగ్ వంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.