న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశంలో గత 10 ఏండ్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు 1,700 చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ ప్రాంత భూమిని కోల్పోయామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే తెలంగాణ, మరికొన్ని రాష్ర్టాల్లో అటవీ ప్రాంత విస్తీర్ణం పెరిగినట్టు పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ రాష్ర్టాల్లో అటవీ విస్తీర్ణం తగ్గిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఫలితంగానే రాష్ట్రంలో పచ్చదనం భారీగా పెరిగినట్టు కేంద్రం ప్రకటన ద్వారా స్పష్టమవుతున్నది.
పంటలకు ఎమ్మెస్పీ అమలుచేయాలి’
న్యూఢిల్లీ, ఆగస్టు 8: రైతుల పంటలను ఎమ్మెస్పీ రేట్లకు కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాలని, రైతులకు న్యాయం చేయాలని విపక్ష ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. టీఎంసీ, ఆర్జేడీ, ఎన్సీపీ (శరద్‌పవార్), శివసేన (యుబీటీ), ఇతర ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో గురువారం నిరసనకు దిగారు. కూరగాయలతో కూర్చిన దండను మెడలో వేసుకున్న విపక్ష ఎంపీలు పార్లమెంట్ మకర ద్వారం మెట్ల వద్ద ఆందోళన చేపట్టారు. ‘ఎన్డీయే మిత్ర పక్షాలు టీడీపీ, జేడీయూలకు కేంద్రం ఎలాగైతే కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ఇచ్చిందో, దేశంలోని రైతులకు కూడా ఎమ్మెస్పీ అమలుజేయాలి’ అని శివసేన (యుబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు.