న్యూఢిల్లీ: తల్లిని కొడుతున్న తండ్రిని అడ్డుకునేందుకు మైనర్ కుమారుడు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఆగ్రహంతో ప్లాస్టిక్ పైప్‌తో తండ్రి తలపై కొట్టి చంపాడు. (Boy Kills Father for Thrashing Mother) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం 10.58 గంటల సమయంలో రోహిణి ప్రాంతంలోని అమన్ విగర్ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ కాల్ వచ్చింది. 16 ఏళ్ల బాలుడు తన తండ్రిని చంపినట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. జరిగిన విషయం తెలుసుకున్నారు.
కాగా, మృతుడు తరచుగా మద్యం సేవించి భార్య, పిల్లలను కొట్టేవాడని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం భార్యతో గొడవ పడిన ఆ వ్యక్తి ఆమెను కొడుతుండగా కుమారుడు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో 16 ఏళ్ల బాలుడు ఆవేశంలో తల్లిని కొడుతున్న తండ్రి తలపై ప్లాస్టిక్ పైపుతో పలుమార్లు కొట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతడి తండ్రి అక్కడికక్కడే మరణించినట్లు చెప్పారు. మైనర్ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.