కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి హిందుత్వ, హిందుత్వవాది పదాలను ఎత్తుకున్నారు. మొన్నటికి మొన్న జైపూర్ వేదికగా హిందువు, హిందూత్వ పదాలను వాడి, రాజకీయ సంచలనానికి తెర లేపిన రాహుల్… తాజాగా తన సొంత నియోజకవర్గమైన అమేథీలో కూడా మళ్లీ ఇవే పదాలను వాడారు. అయితే ఈ సారి ప్రధాని మోదీ తన వారణాసి పర్యటన సందర్భంగా గంగా నదిలో స్నానమాచరించిన అంశాన్ని హిందూ, హిందూత్వ అంశంతో ముడిపెట్టి, విమర్శలకు దిగారు.
అమేథీలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ… ”హిందుత్వ వాది ఒక్కరే గంగలో స్నానమాచరించారు. యోగి లేరు, రాజ్నాథ్ కూడా లేరు. హిందువు మాత్రం కోట్ల మందితో కలిసి స్నానమాచరిస్తారు. హిందువు ఒక్కరే పుణ్య స్నానం చేయడం నేను మొదటిసారిగా చూస్తున్నాను. తాను హిందువునని మోదీ పదే పదే చెబుతారు. కానీ.. ఆయన సత్యాన్ని ఎప్పుడైనా కాపాడారా రెండు కోట్ల మంది యువకులకు ఉద్యోగాలు కల్పిస్తానని ప్రకటించారు. ఆ ప్రకటనపై నిలబడ్డారా?” అని రాహుల్ గాంధీ సూటిగా నిలదీశారు.