Man to Hospital on Cart | ఎంకి పెండ్లి సుబ్బు చావుకొచ్చిందన్నట్లు.. ఓ కుటుంబం తమ ఇంట్లో వృద్ధుడికి వైద్య చికిత్స కోసం తోపుడు బండిపై ఐదు కిలోమీటర్లు తోసుకెళ్లిన ఘటన మీడియాలో వచ్చింది. అందుకు కారణం అంటూ ముగ్గురు స్థానిక విలేకరులపై కేసు నమోదు చేశారు మధ్యప్రదేశ్ పోలీసులు. వివిధ సామాజిక వర్గాల మధ్య శతృత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని, మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద సదరు జర్నలిస్టులపై కేసు నమోదైంది. ఆయా విలేకరుల తప్పుడు, నిరాధార వార్త రిపోర్ట్ చేశారని అభియోగం. కానీ తాము బాధపడిన మాట నిజం, తమ కుటుంబ పెద్దను తోపుడు బండిపై తోసుకెళ్లింది నిజమేనని బాధిత కుటుంబం చెబుతున్నది.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్లోని భిండ్ జిల్లా కలెక్టర్ సతీశ్ కుమార్ ఆదేశాల మేరకు ఏర్పాటైన రెవెన్యూ, హెల్త్ శాఖల దర్యాప్తు కమిటీ.. జర్నలిస్టులు కుంజ్బిహారీ కౌరవ్, అనిల్ శర్మ, ఎన్కే భాటెలెలపై కేసు నమోదు చేసింది. సదరు కుటుంబం అంబులెన్స్ కోసం తమకు ఫిర్యాదు చేయలేదని కలెక్టర్ సతీశ్ కుమార్ చెప్పారు. జ్ఞాన్ ప్రసాద్ విశ్వకర్మను తొలుత ప్రయివేట్ దవాఖానకు తరలించారని అన్నారు. ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లలేదని అన్నారు.
కానీ బాధిత కుటుంబం వాదన మరోలా ఉంది. సదరు రోగి కొడుకు హరికృష్ణ, కూతురు పుష్ప మాట్లాడుతూ ఫోన్ కాల్ చేసినా అంబులెన్స్ రాలేదని చెప్పారు. దీంతో తోపుడు బండిపై ఐదు కిలోమీటర్ల వరకు తోసుకుంటూ దవాఖానకు తీసుకెళ్లామన్నారు. భిండ్ జిల్లాలోని దాబోహ్ పట్టణానికి సమీపాన గల లాహర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనను పలు మీడియా సంస్థలు ప్రసారం చేశాయి.