Dhurandhar 2 | ముంబైలోని హై-సెక్యూరిటీ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాను ఉపయోగించినందుకు గాను బాలీవుడ్ మూవీ ‘ధురంధర్ 2’ చిత్ర బృందంపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. దక్షిణ ముంబైలోని పోర్ట్ ప్రాంతంలో ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా డ్రోన్‌ను వినియోగించినందుకు చిత్ర లొకేషన్ మేనేజర్ రింకూ రాజ్‌పాల్ వాల్మీకిపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు సమాచారం.
గత మూడు రోజులుగా ముంబై ఫోర్ట్ ప్రాంతంలో ‘ధురంధర్ 2’ షూటింగ్ కొనసాగుతుండగా, చిత్ర బృందం ఈ చారిత్రాత్మక ఫోర్ట్ ప్రాంతాన్ని పాకిస్తాన్‌లోని ఒక పాత వీధిని తలపించేలా సెట్ వేసింది. ఫిబ్రవరి 1న జరిగిన షూటింగ్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా పాల్గొన్నారు. ఆ సమయంలోనే నిబంధనలకు విరుద్ధంగా గాలిలోకి డ్రోన్‌ను ఎగురవేయడం పోలీసుల దృష్టికి వచ్చింది. అయితే ముంబైలోని పోర్ట్ ప్రాంతం ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్థిక సంస్థలకు కేంద్రం కావడంతో ఇక్కడ భద్రతా కారణాల దృష్ట్యా డ్రోన్ల వినియోగంపై కఠినమైన ఆంక్షలు అమలులో ఉన్నాయి. అలాగే డ్రోన్ ఎగురవేయడానికి ముందు తీసుకోవాల్సిన తప్పనిసరి అనుమతులను చిత్ర యూనిట్ తీసుకోలేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు లొకేషన్ మేనేజర్‌కు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ఎవరినీ అరెస్టు చేయనప్పటికీ, భద్రతా నిబంధనల ఉల్లంఘనపై కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు. హై-సెక్యూరిటీ జోన్లలో షూటింగ్ జరుపుకునేటప్పుడు చట్టపరమైన అనుమతులు కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.