చెన్నై: బీజేపీ నేత ఒక మంత్రిపై సోషల్ మీడియాలో తప్పుగా పోస్ట్ చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) మంత్రి సెంథిల్ బాలాజీని, బీజేపీ ఇండస్ట్రియల్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ సెల్వకుమార్ ఇటీవల సోషల్ మీడియాలో విమర్శించారు. ఆయనను ‘గంజా బాలాజీ’గా సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో డీఎంకే కార్యకర్తలు దీనిపై మండిపడ్డారు. సురేశ్ కుమార్ అనే వ్యక్తి దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో రెండు గ్రూపుల మధ్య శతృత్వం పెంచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేత సెల్వకుమార్‌ను అరెస్ట్ చేశారు.
కాగా, సెల్వకుమార్ అరెస్ట్‌ను బీజేపీ నేతలు ఖండించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆయనను అరెస్ట్ చేసి సైబర్ క్రైమ్ విభాగానికి తరలించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాలాజీ ఉత్తమరామస్వామి విమర్శించారు. ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారో అన్నది ఇప్పటి వరకు తమకు చెప్పలేదని మండిపడ్డారు. తమిళనాడులో డ్రగ్స్ దుర్వినియోగం పెరిగిందని, శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ వీటిని పట్టించుకోని పోలీసులు బీజేపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులతో అరెస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రధాని మోదీ, తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైను డీఎంకే కార్యకర్తలు, నేతలు విమర్శించినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు.
మరోవైపు బీజేపీ నేత సెల్వకుమార్ అరెస్ట్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కూడా ఖండించారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపిన వారి గొంతు నొక్కేందుకు డీఎంకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇలాంటి వాటికి బీజేపీ కార్యకర్తలు భయపడరని అన్నారు. ఈ మేరకు అన్నామలై ఒక ట్వీట్ చేశారు.
Also Read: