న్యూఢిల్లీ: ఒక మహిళ దారుణానికి పాల్పడింది. కాబోయే భర్త, స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసింది. (Woman Kills Mother) తన ఫోన్‌కు తల్లి స్పందించడం లేదని, వెళ్లి చూడాలని పోలీసులకు ఫోన్ చేసి కోరింది. ఆమె తల్లి హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఆ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మోనికా సోలంకి అనే మహిళ పోలీసులకు ఫోన్ చేసింది. నజాఫ్‌గఢ్ మెయిన్ మార్కెట్లోని బిల్డింగ్ నాల్గవ అంతస్తులో 58 ఏళ్ల తల్లి ఒంటరిగా నివసిస్తున్నట్లు తెలిపింది. తన ఫోన్ కాల్‌కు ఆమె స్పందించడం లేదని చెప్పింది. అక్కడకు వెళ్లి చూడాలని కోరింది.
కాగా, ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. బెడ్రూమ్ నేలపై సుమిత్ర మరణించి ఉండటాన్ని గమనించారు. ఆమె నుదిటి, కన్ను, చేతుల మణికట్టుపై గాయాలు ఉండటం, నోటి నుంచి రక్తం కారడంతో ఆ మహిళను దారుణంగా కొట్టి హత్య చేసినట్లు గ్రహించారు. ఆ భవనంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. శుక్రవారం తెల్లవారుజామున 2.18 గంటల సమయంలో ఒక మహిళతో పాటు ఇద్దరు పురుషులు ఆ ఫ్లాట్‌లోకి ప్రవేశించినట్లు గమనించారు.
మరోవైపు సీసీటీవీ ఫుటేజీని స్పష్టంగా పరిశీలించిన పోలీసులు ఆ మహిళను మోనికాగా నిర్ధారించారు. ఆమె వెంట ఉన్న నవీన్ కుమార్ కాబోయే భర్తగా, హర్యానాకు చెందిన యోగేష్ అతడి ఫ్రెండ్‌గా గుర్తించారు. వారిద్దరి సహాయంతో ఆస్తి కోసం తల్లిని మోనికా హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.