కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యేల్లో సగం మంది పార్టీ విప్‌ను ధిక్కరించారు. ఈ నేపథ్యంలో వారిపై చర్యలకు అంతర్గత క్రమశిక్షణా కమిటీ సన్నద్ధమైంది. (Trinamool Congress) దీని కోసం ఎమ్మెల్యేల జాబితాను సిద్ధం చేసింది. సీఎం మమతా బెనర్జీ యూకే పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోనున్నది. రెండో దశ బడ్జెట్ సమావేశాల చివరి రెండు రోజులైన మార్చి 19, 20 తేదీల్లో వంద శాతం హాజరు కావాలని పార్టీ శాసనసభ్యులకు టీఎంసీ విప్ జారీ చేసింది.
కాగా, మార్చి 19న దాదాపు వంద శాతం మంది టీఎంసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే మార్చి 20న 50 మందికి పైగా పార్టీ శాసనసభ్యులు పార్టీ విప్‌ను పట్టించుకోలేదు. అసెంబ్లీ సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో టీఎంసీ అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నది. అసెంబ్లీ సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలు న్యాయమైన కారణాలతో ముందస్తుగా సమాచారం ఇచ్చారా లేదా అన్నది స్పీకర్ కార్యాలయం నుంచి సమాచారం సేకరించింది.
మరోవైపు విప్‌ను విస్మరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని 50 మందికి పైగా ఎమ్మెల్యేల్లో ఇద్దరు మంత్రులతో సహా పది మంది సభ్యులు మాత్రమే ముందస్తుగా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మిగతా ఎమ్మెల్యేలపై చర్యల కోసం జాబితాను టీఎంసీ అంతర్గత క్రమశిక్షణా కమిటీ సిద్ధం చేసింది. యూకే పర్యటన నుంచి సీఎం మమతా బెనర్జీ తిరిగి వచ్చాక దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నది. అయితే విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలను మందలించి వదిలేస్తారా లేక వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా అన్నది స్పష్టం కాలేదు.