అహ్మదాబాద్: మూడు నెలల కుమారుడు నిరంతరం ఏడ్వటంపై తల్లి విసిగిపోయింది. నీటి సంపులో పడేసి హత్య చేసింది. (Mother Kills Infant For Crying) తన కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఆ మహిళను అరెస్ట్ చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ సంఘటన జరిగింది. మేఘానీనగర్ ప్రాంతంలోని అంబికానగర్లో నివసించే 22 ఏళ్ల కరిష్మా బాఘేల్ మూడు నెలల కిందట బాబుకు జన్మనిచ్చింది. అయితే పసి కుమారుడు నిరంతరం ఏడ్వటంపై ఆమె విసిగిపోయింది. ఏప్రిల్ 5న అండర్ గ్రౌండ్లో ఉన్న నీటి సంపులో బాబును పడేసి హత్య చేసింది.
కాగా, మూడు నెలల కుమారుడు ఖాయల్ కనిపించడం లేదని కరిష్మా హడావుడి చేసింది. దీంతో ఆమె భర్త దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కరిష్మాను ప్రశ్నించగా ఆమె విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇచ్చింది. బాబును ఇంట్లో ఉంచి స్నానానికి వెళ్లినట్లు చెప్పింది. ఆ తర్వాత చూడగా కుమారుడు మాయమైనట్లు ఆరోపించింది.
మరోవైపు ఆ ఇంటి పరిసరాల్లో పోలీసులు వెతికారు. చివరకు నీటి సంపులో బాబు మృతదేహాన్ని గుర్తించారు. ప్రమాదవశాత్తు అందులో పడే అవకాశం లేకపోవడంతో కరిష్మాపై అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తు చేయగా నిరంతరం ఏడుస్తున్నందుకు కుమారుడ్ని ఆమె చంపినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ఆ మహిళను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.