చెన్నై: ఒక కుటుంబానికి చెందిన పెంపుడు కుక్కను ‘కుక్క’ అని పిలిచినందుకు ఒక వృద్ధుడ్ని హత్య చేశారు. విస్తూపోయే ఈ సంఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో జరిగింది. తాడికొంబు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉలగంపట్టియార్కొట్టంలో నిర్మలా ఫాతిమా రాణి అనే మహిళ కుమారులు డేనియల్, విన్సెంట్తో కలిసి నివసిస్తున్నది. వారికి ఒక పెంపుడు కుక్క ఉన్నది. 62 ఏళ్ల రాయప్పన్ పొరుగున ఉంటున్నాడు. అయితే తమ పెంపుడు కుక్కను ‘కుక్క’ అని పిలువవద్దని ఇటీవల ఆయనను వారు హెచ్చరించారు.
కాగా, గురువారం ఇంటి సమీపంలోని పొలానికి నీళ్లు పెట్టే మోటర్ స్విచ్ ఆఫ్ చేయాలని తన మనవడితో రాయప్పన్ అన్నాడు. అలాగే పొరుగింటి కుక్క తిరుగుతూ ఉంటుందని, ఒక కర్రను కూడా తీసుకురావాలని చెప్పాడు. అయితే నిర్మలా కుమారుడైన డేనియల్ ఇది విన్నాడు. తమ పెంపుడు కుక్కను ‘కుక్క’ అన్నందుకు ఆగ్రహంతో రాయప్పన్ ఛాతిపై పంచ్ ఇచ్చాడు. దీంతో ఆ వృద్ధుడు కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు. ఇది చూసి డేనియల్, ఇతర కుటుంబ సభ్యులు పరారయ్యారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. పారిపోయిన నిర్మలా, ఆమె కుమారులను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.