Tajinder Bagga | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై బెదిరింపులకు పాల్పడిన బీజేవైఎం నాయకుడు తేజిందర్ పాల్ సింగ్ బగ్గా అరెస్ట్ రకరకాల మలుపులు తిరిగింది. ఐదుసార్లు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినా తేజిందర్ బగ్గా స్పందించకపోవడంతో ఆయన్ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ నేతల మధ్య సాగిన ఆరోపణలు, బెదిరింపులపై కేసు.. అటుపై అరెస్ట్ చిత్ర విచిత్ర మలుపులు తిరిగింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ పోలీసులు జోక్యం చేసుకోవడం హైడ్రామాకు దారి తీసింది.
శుక్రవారం ఉదయం ఐదు గంటలకు పంజాబ్ పోలీసులు తేజిందర్ బగ్గాను అరెస్ట్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. తేజిందర్ పాల్ సింగ్ తండ్రి ఢిల్లీలో తన కొడుకును కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. దరిమిలా తేజిందర్‌ను మొహాలీకి తీసుకెళ్తున్న పంజాబ్ పోలీసులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు.
తేజిందర్ బగ్గాను తీసుకెళ్తున్న కారును చుట్టుముట్టిన హర్యానా పోలీసులు.. కురుక్షేత్ర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పంజాబ్ పోలీసులను అరెస్ట్ చేశారు. ఇదే టైంలో తేజిందర్‌ను హర్యానా పోలీసులకు అప్పగించాలని, ఢిల్లీకి అప్పగించొద్దన్న పంజాబ్ ప్రభుత్వ డిమాండ్‌ను పంజాబ్ & హర్యానా హైకోర్టు తప్పుబట్టింది. కిడ్నాపింగ్ ఫిర్యాదు ఆధారంగా తమకు అప్పగించాలని ఢిల్లీ పోలీసులు రిక్వెస్ట్ చేశారు. దీంతో సెర్చ్ వారంట్ కోసం కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం నుంచి సెర్చ్ వారంట్ తీసుకుని కురుక్షేత్ర పోలీస్ స్టేషన్‌కెళ్లి తేజిందర్ బగ్గాను తమ ఆధీనంలోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. ఈ సందర్భంగా తేజిందర్ బగ్గా విక్టరీ సంకేతాన్ని చూపారు.