Postal Drone Service | ఇండియన్ పోస్ట్ తొలిసారి టపాను డ్రోన్ ద్వారా బట్వాడా చేసింది. ప్రయోగాత్మకంగా గుజరాత్‌లోని కచ్ జిల్లాలో డ్రోన్‌ను ఉపయోగించి టపా బట్వాడా ప్రక్రియ పూర్తి చేసినట్లు తపాలాశాఖ అధికారులు ఆదివారం తెలిపారు. 46 కి.మీ. దూరాన్ని 25 నిమిషాల్లో చేరుకున్న డ్రోన్ టపా బట్వాడా చేసిందన్నారు. భుజ్ తాలుకాలోని హబాయ్ గ్రామం నుంచి కచ్ జిల్లా బచావు తాలుకా నెర్ గ్రామానికి ఈ టపా రవాణా చేసింది. దీనికి కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ మార్గదర్శకత్వం వహించిందని అహ్మదాబాద్‌లోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తెలిపింది.
ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో భవిష్యత్‌లో డ్రోన్ ద్వారా పోస్టల్ డెలివరీ సాధ్యమేనని పీఐబీ పేర్కొంది. అధునాతన టెక్నాలజీ సాయంతో భారత తపాలాశాఖ తొలిసారి దేశ తపాలా చరిత్రలో పైలట్ ప్రాజెక్టుగా డ్రోన్ టెక్నాలజీ సాయంతో తపాలా బట్వాడా విజయవంతంగా పూర్తి చేసిందని వివరించింది.