న్యూఢిల్లీ: ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’ అన్నట్టు ఉంది దేశంలో ప్రస్తుతం పరిస్థితి. ఇప్పటికే మండుతున్న ధరలతో అల్లాడిపోతున్న సామాన్యుడిపై మరో పిడుగు పడనుంది. మళ్లీ ధరలు పెంచేందుకు ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) కంపెనీలు సిద్ధమవుతున్నాయి.
దీంతో సబ్బులు, డిటర్జంట్లు, బిస్కెట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ వంటి నిత్యావసరాల ధరలు మరింత పెరుగనున్నాయి. ముడి చమురు ధరలతో సంబంధం ఉన్న ద్రవ్యోల్బణం, ప్యాకేజింగ్, ఇంధన వ్యయం పెరగడం, భౌగోళిక-రాజకీయ అస్థిరతల కారణంగా ధరలు పెంచక తప్పడం లేదని ఎఫ్ఎమ్సీజీ తయారీ సంస్థలు పేర్కొన్నాయి. ఇటీవలే పలు ఎఫ్ఎమ్సీజీ కంపెనీలు 3-5 శాతం మేర రేట్లను పెంచాయి. తాజాగా రూ.10, 15 ప్యాకెట్ల ధరలను మినహాయించి మిగతా వాటి ధరలను పెంచడమో లేదా పరిమాణాన్ని తగ్గించడమో చేయాలని అవి భావిస్తున్నాయి.
రాయితీలు, ప్రచార ఖర్చును తగ్గించడం, సరఫరా వ్యవస్థను క్రమబద్ధీకరించడం, అంతర్గత వ్యయం పరిమితి తగ్గించడంపై దృష్టి సారిస్తున్నప్పటికీ వినియోగదారులు కొంత భారాన్ని మోయాల్సి ఉంటుందని కంపెనీలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను నాలుగు శాతం పెంచినట్టు డాబర్ ఇండియా తెలిపింది. త్వరలో తమ ఉత్పత్తుల ధరలను 20 శాతం మేర పెంచుతామని బ్రిటానియా కంపెనీ వెల్లడించింది. తమపై ఒత్తిడి పెరిగితే తమ సబ్బులు, డిటర్జెంట్ల ధరలు పెంచక తప్పదని హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ పేర్కొన్నది. ముడి చమురుతో ముడిపడి ఉన్న సరఫరా వ్యవస్థ దెబ్బ తినడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి అని ఆ కంపెనీ సీఎఫ్వో నిరంజన్ గుప్తా తెలిపారు. ఇదే సమయంలో కరెన్సీ విలువ నిరంతరం క్షీణించడం వల్ల ఉత్పత్తి వ్యయాలు మరింత పెరిగాయని పేర్కొన్నారు.
ఫెవికాల్ తదితర ఉత్పత్తులను తయారు చేసే పిడిలైట్ ఇండస్ట్రీస్ కూడా మరోసారి ధరల పెంపుదలకు సిద్ధమవుతున్నది. పారాచూట్, సఫోలా బ్రాండ్ల ద్వారా కొబ్బరి నూనె, వంట నూనెలను అమ్మే మారికో సంస్థ ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను 6-7 శాతం పెంచింది. ప్రస్తుతానికి ధరలను అలాగే ఉంచడంపై ఆ కంపెనీ దృష్టి సారిస్తున్నది. తాజా పరిస్థితిపై నెస్లే ఇండియా చైర్మన్ మనీశ్ తివారీ మాట్లాడుతూ…‘రానున్న రెండు నెలల్లో ఏం జరుగబోతున్నదో ఎవరూ కచ్చితంగా అంచనా వేయలేనంత క్లిష్టంగా పరిస్థితి ఉన్నది. పరిస్థితులను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. భవిష్యత్తుపై మాకు ఇదొక హెచ్చరిక సంకేతం’ అని అన్నారు.
ఇప్పటికే కమర్షియల్ ఎల్పీజీ ధరలను భారీగా పెంచిన కేంద్ర ప్రభుత్వం.. త్వరలో పెట్రో ధరలను కూడా పెంచేందుకు యోచిస్తున్నది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో దేశంలో ఇంధన ధరల పెంపు తప్పదని వార్తలు వెలువడుతున్నాయి. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలు పెంచని కేంద్రం.. పోలింగ్ పూర్తయిన వెంటనే కమర్షియల్ ఎల్పీజీపై ఏకంగా 993 రూపాయలు పెంచిన విషయం తెలిసిందే.
ఎన్నికల ముందు వరకు పెట్రో ధరలు పెంచబోమని బుకాయించిన కేంద్రంలోని మోదీ సర్కార్.. తాజాగా పెట్రో మంట తప్పదని మీడియాకు లీకులు ఇస్తున్నది. చమురు కంపెనీలకు భారీగా నష్టాలు వస్తున్నాయని, ధర పెంపు అనివార్యం అంటూ పేర్కొంటున్నది. ఈ నేపథ్యంలో త్వరలోనే పెట్రో బాదుడు మొదలయ్యే అవకాశం ఉందని నివేదికలు వెలువడుతున్నాయి. అదే జరిగితే సామాన్యుడి నడ్డి విరగడం ఖాయం.