న్యూఢిల్లీ, ఆగస్టు 29: ఇటీవలి సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా అత్యంత విధ్వంసకర వర్షాకాలాన్ని ఈ ఏడాది భారత్ చవిచూస్తోంది. ఉత్తర భారతం సగటు కన్నా 21 శాతం అధిక వర్షపాతాన్ని నమోదు చేసుకోవడంతో కేదార్‌నాథ్‌లో 2013లో సంభవించిన వరద బీభత్సం తర్వాత తిరిగి అంతటి స్థాయిలో వర్షాలను ఈ ఏడాది ఉత్తర భారతంలో అనేక ప్రాంతాలు ఎదుర్కొంటున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. ఇటీవల జమ్మూ కశ్మీరులో భారీ వర్షాలకు వంతెనలు కూలిపోగా, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 34 మంది వైష్ణోదేవి యాత్రికులు మరణించారు. హిమాచల్ ప్రదేశ్‌లో పర్యాటక ప్రదేశాలు నీట మునిగిపోగా, పంజాబ్‌లో పట్టణ ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉత్తర భారతం పంట నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. తాజా పరిస్థితులతో విపత్తులను ఎదుర్కొనే సంసిద్ధతలో భారత వైఫల్యాలు విస్పష్టంగా కనిపిస్తున్నాయి.
వర్షాల కారణంగా భారీ స్థాయిలో దెబ్బ తిన్న రాష్ర్టాలలో జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని బస్తర్ ఉండడం గమనార్హం. ఈ ప్రాంతాలన్నీ వర్ష బీభత్సాన్ని ఎదుర్కొంటుండగా రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 29: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడుగా మరోసారి మేఘ విస్ఫోటం సంభవించింది. వర్షాల వల్ల అయిదుగురు మృతి చెందారని అధికారులు తెలిపారు. వరదల తాకిడికి గురైన గ్రామాల నుంచి 70 మంది గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. 8 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు వారు చెప్పారు. మందాకిని నది పొంగి ప్రవహిస్తుండడంతో కేదార్నాథ్, మందాకిని లోయ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. వాసు కేదార్ ప్రాంతంలో మేఘ విస్ఫోటం సంభవించింది. అనేక మంది గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయని ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు.
ఢిల్లీలోని వివిధ ప్రాంతాలతోపాటు చుట్టూ ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో శుక్రవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి రహదారులు సైతం నీటిలో మునిగిపోగా అనేక ప్రాంతాలలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఢిల్లీ విమానాశ్రయంలో 250 విమానాల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా ప్రగతి మైదాన్, డిఫెన్స్ కాలనీ, ప్రీత్ విహార్తోసహా అనేక ప్రాంతాలు జలమయం కాగా, డిల్లీ ఎల్లో లైనులో మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.