హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : రూ.లక్ష, రూ.90 వేలు, రూ.55 వేలు.. ఇవి శుక్రవారం భారత్లోని విమాన టికెట్ల ధరలు. నిర్వహణ లోపాలతో వందలాది ఇండిగో విమాన సర్వీసుల రద్దు శుక్రవారం కూడా కొనసాగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడగా, టికెట్ రేట్లు మాత్రం ఆకాశాన్నంటాయి. మిగతా రోజులతో పోలిస్తే టికెట్ ధరలు 3 నుంచి 10 రెట్లు ఎక్కువగా పెంచి విక్రయిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు టికెట్ ధర రూ.1,02,000 ఉండగా, చెన్నై-ఢిల్లీ టికెట్ రూ.90,000, ఢిల్లీ-ముంబయి టికెట్ రూ.54,222 పలికి ప్రయాణికులకు చుక్కలను చూపాయి. పలు ఎయిర్ లైన్ల టికెట్ ధరలు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఉన్నాయి. ముంబయి-శ్రీనగర్లో సాధారణంగా రూ.10వేలు ఉండే టికెట్ ధర ఏకంగా రూ.62 వేలకు పెరిగింది. అదే రౌండ్ ట్రిప్ అయితే దాదాపు రూ.92 వేల వరకు ఉంది.
శనివారం ప్రయాణానికి గాను ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఎయిరిండియా విమాన ప్రయాణ టికెట్ ధర రూ.33 వేలకు చేరింది. సాధారణ రోజుల్లో ఇది రూ.5-7 వేల మధ్య ఉండేది. 7వ తేదీకి ఢిల్లీ-చెన్నై ఎకానమీ క్లాస్ కనీస టికెట్ ధర రూ.53 వేలుగా, ఢిల్లీ-హైదరాబాద్ కనీస టికెట్ ధర రూ.25 వేలుగా ఉంది.
విమాన సర్వీసుల నిలిపివేతపై ఇండిగో సంస్థ వినియోగదారులకు క్షమాపణలు చెప్తూ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చింది. క్షమించండి.. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని ప్రయాణికులను ఉద్దేశించి వెల్లడించింది. డిసెంబర్ 5-15 మధ్య ప్రయాణాలకు టికెట్ బుక్చేసుకొని, ఈ అంతరాయాల కారణంగా వాటిని రద్దు, రీషెడ్యూల్ చేసుకుంటే పూర్తి రిఫండ్ ఇస్తామని ప్రకటించింది.