బెంగళూరు, ఆగస్టు 11: బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ట్రాఫిక్‌లో చిక్కుకుని నగర వాసుల పడే అవస్థలు అంతా ఇంతా కాదు. ఇక వర్షం పడిందంటే ప్రజలకు చుక్కలే. ఐటీ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అనేక మంది నగర ట్రాఫిక్ సమస్యను సోషల్‌మీడియాలో నిత్యం ఎండగడుతూనే ఉంటారు. తాజాగా ఐదేండ్ల బాలిక బెంగళూరు ట్రాఫిక్ ఇబ్బందులను వివరిస్తూ ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాసింది. దెబ్బ తిన్న రోడ్లు, భారీ ట్రాఫిక్ కారణంగా తాను రోజూ స్కూలుకు వెళ్లడం ఆలస్యం అవుతోందంటూ ఆర్య అనే ఆ బాలిక తన రోజువారీ కష్టాలను ఆ లేఖలో ప్రధానికి వివరించింది.
నరేంద్ర మోదీజీ చాలా ట్రాఫిక్ ఉంటోంది. స్కూలుకు వెళ్లేందుకు రోజూ ఆలస్యం అవుతోంది. రోడ్లు బాలేవు. దయచేసి సాయం చేయండి అంటూ ఆ బాలిక ప్రధానికి తన గోడు వెళ్లబోసుకుంది. తన కుమార్తె రాసిన లేఖను ఆర్య తండ్రి అభిరూప్ చటర్జీ ఎక్స్‌లో షేర్ చేశారు. మెట్రో ఎల్లో లైన్ ప్రారంభోత్సవానికి బెంగళూరుకు ప్రధాని మోదీ విచ్చేసిన సందర్భంగా, నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించగలరని తన కుమార్తె ఆశిస్తోందని ఆయన తెలిపారు. ఎక్స్‌లో వైరల్ అయిన చిన్నారి లేఖను నాలుగు లక్షల మందికి పైగా వీక్షించారు. బెంగళూరు ట్రాఫిక్‌తో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను చాలా మంది నెటిజన్లు పంచుకున్నారు.