షాదోల్: పశువులు విచ్చిలవిడిగా సంచరిస్తూ వచ్చీపోయే వాహనాలకు అడ్డుపడుతుండటం, మలమూత్ర విసర్జనలతో వీధులను అపరిశుభ్రం చేస్తుండటంతో ఓ గ్రామ సర్పంచ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సమస్య పరిష్కారం కోసం సరికొత్త నిబంధన తీసుకొచ్చారు. ఆ నిబంధనను ఉల్లంఘించిన వారికి శిక్షలను కూడా నిర్ణయించారు. గ్రామంలో డప్పు చాటింపు వేయించి మరీ ప్రజలకు ఆ నూతన నిబంధన గురించి, శిక్షల గురించి అవగాహన కల్పించారు.
ఇంతకూ ఏమిటా నిబంధన, ఏమిటా శిక్షలు అంటే.. ఇకపై గ్రామంలో ఎవరు కూడా పశువులను ఎలాంటి కాపలా లేకుండా గాలికి వదిలేయకూడదు అనేది నిబంధన. ఇక శిక్షల విషయానికి వస్తే.. ఈ నిబంధనను ఎవరు ఉల్లంఘించినా వారికి ఐదు చెప్పు దెబ్బలు, రూ.500 జరిమానా. కాగా, గ్రామ సర్పంచ్ నిర్ణయంపై ప్రజల్లో కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇక వినూత్న నిర్ణయం తీసుకున్న గ్రామ సర్పంచ్ ఎవరంటే.. ఆయన మన రాష్ట్రానికి చెందినవాడు కాదు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాదోల్ జిల్లాలోగల నగ్నదుయ్ గ్రామానికి చెందిన సర్పంచ్. గ్రామంలో పశువుల స్వేచ్ఛా సంచారంవల్ల వీధులన్నీ అపరిశుభ్రంగా మారుతున్నాయని, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నదని, అందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సర్పంచ్ చెబుతున్నారు.