Regional Parties | న్యూఢిల్లీ, మే 11: లోక్సభ ఎన్నికల్లో 400కుపైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకొన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. 200 సీట్లు కూడా దాటవనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ‘400+’ కలలకు ప్రాంతీయ పార్టీలు చెక్ పెడుతాయని విశ్లేషకులు అంటున్నారు. వివిధ రాష్ర్టాల్లో జరిగిన, జరుగుతున్న ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని తెలుస్తున్నది. ఈ సారి భారీ మెజార్టీతో విజయం సాధించాలన్న బీజేపీ ప్లాన్ను పలు అంశాలు అడ్డుకొంటున్నాయి.
దేశంలో ప్రాంతీయ పార్టీలకు చెక్కుచెదరని చరిత్ర ఉన్నది. గత కొన్నేండ్లుగా పలు పార్టీలు పుంజుకొని.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ను సవాల్ చేసే స్థితికి వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ, మహారాష్ట్రలో ఎన్సీపీ, తమిళనాడులో డీఎంకే, ఒడిశాలో బీజేడీ, జార్ఖండ్లో జేఎంఎం, యూపీలో ఎస్పీ, బీహార్లో ఆర్జేడీ వంటి పార్టీలతో పాటు ఈశాన్య రాష్ర్టాల్లో పలు పార్టీలు బలంగా ఉన్నాయి. మరోవైపు ఢిల్లీ, పంజాబ్లో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్.. బీజేపీ జోరుకు అడ్డుగా మారింది. పలు రాష్ర్టాల్లో ఆ పార్టీ తన ప్రభావాన్ని చాటుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.
‘ఆబ్కీ బార్ 400 పార్ (ఈసారి 400కు పైగా స్థానాలు)’ నినాదం చుట్టూనే ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం సాగుతున్నది. రాజ్యాంగాన్ని మార్చేందుకే అవసరమైన సంఖ్యా బలం కోసం బీజేపీ ఈ నినాదం ఎత్తుకొన్నదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను లాగేసుకొంటారనే ఆందోళన దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీల్లో నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎత్తుకొన్న ఆ నినాదం ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రాంతీయ పార్టీలకు ప్రచారాస్త్రంగా మారింది. మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ కూడా ప్రచారం చేస్తున్నది.
గతంలో విపక్షాలు ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చడంతో.. అది బీజేపీ లాభించింది. అయితే ఈసారి విపక్ష పార్టీలు కలిసి కూటమిగా బీజేపీకి వ్యతిరేకంగా పోటీచేస్తున్నాయి. సీట్లను పంచుకోవడంతో ఓట్ల చీలికకు అవకాశం లేకుండా పోయింది. అయితే యూపీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ర్టాల్లో ఈ మంత్రం పనిచేయలేదు. యూపీలో కాంగ్రెస్-ఎస్పీలతో కలవకుండా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ వేరుగా పోటీచేస్తున్నది. బెంగాల్లో కూడా మమత నేతృత్వంలోని టీఎంసీ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో బరిలో నిలిచారు. మరోవైపు ఇక్కడ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూటమిగా పొటీకి నిలిచాయి.
బీహార్ వంటి రాష్ర్టాల్లో మిత్రపక్ష పార్టీలపై వ్యతిరేకత వల్ల బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చే అవకాశం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలను పెద్దయెత్తున ఫిరాయింపులు చేయడం ద్వారా పలు రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చి, బీజేపీ గద్దె నెక్కడంపై కూడా ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తున్నది. తమిళనాడులో అన్నాడీఎంకే వంటి ప్రాంతీయ పార్టీని కూటమిలో చేర్చుకోవడంలో విఫలం కావడం, కర్ణాటక, బీహార్ వంటి రాష్ర్టాల్లో వ్యతిరేకత ఉన్న పార్టీలతో జట్టు కట్టడం బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.