స్పెషల్ టాస్క్ బ్యూరో (నమస్తే తెలంగాణ); లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు హిందీ రాష్ర్టాల్లో బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో కమలదళం మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోగా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లు కాంగ్రెస్ చేజారిపోయాయి. కాగా, ఈ మూడు రాష్ర్టాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఛత్తీస్‌గఢ్
1. మహదేవ్ యాప్ కేసు: బెట్టింగ్ యాప్ రూపొందించేందుకు స్వయంగా సీఎం భూపేశ్ బఘేల్ తనను ప్రోత్సహించారని ప్రధాన నిందితుడు శుభమ్ సోని ఆరోపించడం.. బఘేల్ రూ. 508 కోట్లు తీసుకొన్నట్టు ఈడీ ఆరోపించడం దుమారం రేపింది.
2. ఓబీసీ రిజర్వేషన్: స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి అధికారంలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ఓబీసీ రిజర్వేషన్లను తీసుకురాలేదన్న బీజేపీ విమర్శలను సమర్థంగా తిప్పికొట్టడంలో కాంగ్రెస్ విఫలం. దీంతో ఓబీసీ ఓటర్లు దూరమయ్యారు.
3. ప్రభుత్వంలో అవినీతి: ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ( సీజీపీఎస్సీ)లో అక్రమాలు, ఉద్యోగాల నియామకాల్లో బంధువులకు ప్రాధాన్యం ఇవ్వడం, బొగ్గు రవాణా, డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్, మద్యం వ్యాపారం, పీడీఎస్‌లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు నష్టం చేకూర్చాయి.
4. దూరమైన గిరిజనులు: గిరిజనులు ఏండ్లుగా పోరాడుతున్న ‘జల్, జంగల్, జమీన్ (నీళ్లు, అటవీ పరిరక్షణ, భూహక్కులు)’ కల్పిస్తామన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమవ్వడంతో ప్రభుత్వంపై ఆ వర్గంలో వ్యతిరేకత పెరిగింది.
5. మౌలిక సదుపాయాల కల్పనలేమి: రాష్ర్టాభివృద్ధికి కీలకమైన రోడ్లు, రైల్వే, విద్యుత్తు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం.
రాజస్థాన్
1. అంతర్గత కుమ్ములాటలు: 2018లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌లో సీఎం అశోక్ గెహ్లాట్, మరో కీలక నేత సచిన్ పైలట్ మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉన్నది. దీంతో ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపై ఉన్న శ్రద్ధ రాష్ర్టాభివృద్ధిపై లేకుండాపోయింది.
2. ఇచ్చిన హామీలు గాలికి: వసుంధర రాజే నేతృత్వంలోని గత బీజేపీ సర్కారుపై అవినీతి ఆరోపణలు చేసి 2018లో గద్దెనెక్కిన కాంగ్రెస్ తదనంతర గత ప్రభుత్వంపై చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోలేదు.
3. పేపర్ లీకులు: గడిచిన ఐదేండ్లలో 18 పేపర్లకు పైగా పరీక్షా పేపర్లు లీక్ అవ్వడంపై నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు.
4. రెడ్ డైరీ: గెహ్లాట్ సర్కారు లంచాల బాగోతం అంతా ఈ ‘రెడ్ డైరీ’లో ఉందంటూ సొంత పార్టీ నేత, మంత్రి రాజేంద్ర గుఢా అసెంబ్లీలో ప్రకటించడం దుమారం రేపింది.
5. శాంతి-భద్రతల వైఫల్యం: ఉదయ్‌పూర్‌లోని టైలర్ కన్హయ్య లాల్ సాహూ హత్య, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయినప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టలేదన్న విమర్శలు.
మధ్యప్రదేశ్
1. ఎండగట్టలేక..: వివిధ వర్గాలను ఆకట్టుకొనేలా బీజేపీ మ్యానిఫెస్టోలో తీసుకొచ్చిన ‘మామా స్కీమ్’, 450కే సిలిండర్, అయోధ్య దర్శనం వంటి పథకాలకు ధీటైనవి ప్రకటించడంలో కాంగ్రెస్ విఫలమైంది. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడంలోనూ ఫెయిల్.
2. కమల్‌నాథ్: మాజీ సీఎం కమల్‌నాథ్‌ను సీఎం అభ్యర్థిగా ముందే ప్రకటించడం నష్టాన్ని తీసుకొచ్చింది. కమల్‌కు ఆయావర్గాల్లో మద్దతు అంతగా లేకపోవడం, ప్రచారంలో దూకుడు ప్రదర్శించకపోవడం మైనస్‌గా మారింది.
3. సింధియా ఎపిసోడ్: రాష్ట్రంలో 34 సీట్లు ఉన్న గ్వాలియర్-చంబల్ ఎంతో కీలకమైంది. 2020లో జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడి బీజేపీలో చేరారు. దీంతో ఈ ప్రాంతంలో మరో బలమైన నేతను తయారుచేయడంలో కాంగ్రెస్ విఫలమైంది.
4. వ్యూహాలేవి?: 2018లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. బీజేపీ వ్యూహాలతో 15 నెలల్లోనే గద్దె దిగాల్సి వచ్చింది. అయితే, అప్పటినుంచి కమలదళాన్ని ఎదుర్కొనేందుకు ఎటువంటి బలమైన వ్యూహాలను పార్టీ రచించలేదు. సరైన కార్యాచరణ లేదు. విమర్శల్లోనూ దూకుడు కనిపించలేదు.
5. హిందూత్వ ఆకర్షణ ఫెయిల్: హిందూ ఓటర్లను ఆకర్షించడానికి భజరంగ్ సేనతో కాంగ్రెస్ చేతులు కలిపింది. ఇదే సమయంలో ముస్లింలకు పలు హామీల వర్షాన్ని కురిపించింది. దీంతో హిందూ ఆకర్షణ మంత్రం పనిచేయలేదు.