Encounter : ఛత్తీస్గఢ్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు నక్సలైట్లు మరణించారు. భద్రతాబలగాల్లో కూడా ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో ఒకరికి కాలిలో బుల్లెట్ దిగగా, మరొకరికి తలలోకి వెళ్లింది. అయితే ఇద్దరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కంకేర్ నారాయణపూర్ జిల్లా సరిహద్దులోని మాద్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి భద్రతాబలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కాగా ఛత్తీస్గఢ్లో అతిపెద్ద నక్సల్స్ ఆపరేషన్ అక్టోబర్ 4న అబుజ్మడ్ అడవుల్లో జరిగింది. నక్సలైట్లపై నిర్వహించిన ఆ యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో 31 మంది నక్సలైట్లు మరణించారు.
ఎన్కౌంటర్ జరిగిన పది రోజుల తర్వాత అక్టోబర్ 14న మావోయిస్టులు విడుదల చేసిన ప్రెస్ నోట్లో ఎన్కౌంటర్లో మరణించిన నక్సల్స్ 31 మంది కాదని, మొత్తం 35 మంది అని పేర్కొన్నారు. అక్టోబర్ 18న బస్తర్ ఐజీ సుందర్రాజ్ మాట్లాడుతూ.. ఆ ఎన్కౌంటర్లో మొత్తం 38 మంది నక్సలైట్లు మరణించారని తెలిపారు.