న్యూఢిల్లీ: ఢిల్లీ, గురుగ్రామ్, రోహతక్ కు చెందిన 10 ప్రదేశాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం తనిఖీలు నిర్వహించింది. మనీల్యాండరింగ్ కేసులో రావు ఇంద్రజిత్ యాదవ్( Rao Inderjeet Yadav)కు చెందిన నివాసాల్లో ఆ సోదాలు జరిగాయి. ప్రస్తుతం నిందితుడు రావు ఇంద్రజీత్ యూఏఈకి పారిపోయాడు. తమ సోదాల్లో అయిదు లగ్జరీ కార్లు, బ్యాంక్ లాకర్లు, సుమారు 17 లక్షల నగదు, డాక్యుమెంట్లు, డిజిటల్ డివైస్‌లు, డిజిటల్ డేటాను సీజ్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. గత ఏడాది రోహతక్‌లో వ్యాపారవేత్త మర్డర్ ఘటన తర్వాత ఇంద్రజీత్ మిడిల్ ఈస్ట్‌కు పరారీ అయ్యాడు. ప్రస్తుతం యాదవ్‌పై మనీల్యాండరింగ్ కేసులో దర్యాప్తు జరుగుతున్నది. బెదిరింపులకు పాల్పడడం, ప్రైవేటు ఫైనాన్షియర్లతో సెటిల్మెంట్లు, అక్రమాల ద్వారా కమీషన్ల దందాకు పాల్పడినట్లు ఇంద్రజీత్‌పై ఆరోపణలు ఉన్నాయి.
ఇంద్రజిత్ యాదవ్‌తో పాటు అతనికి సంబంధం ఉన్న వ్యక్తులపై హర్యానా, యూపీ రాష్ట్రాల్లో సుమారు 15 కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. జెమ్ రికార్డ్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఓనర్ రావు ఇంద్రజీత్. ఆ కంపెనీని జెమ్స్ ట్యూన్స్ పేరుతో ఆపరేట్ చేస్తున్నారు. 2006లో దీన్ని యాదవ్ స్థాపించారు. వీడియో ఆన్ డిమాండ్ ఫ్లాట్‌ఫామ్‌గా జెమ్స్ ట్యూన్స్ ఆపరేట్ చేస్తున్నారు. హర్యాన్వీ, పంజాబీ, హిందీ భాషల్లో ప్రాంతీయ పాటలను నిర్మించి, డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇంద్రజీత్కు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 12 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలతోనూ అతను పిక్‌లను పోస్టు చేస్తూ ఉంటాడు.
కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ ఫైనాన్షియర్ల మధ్య లోన్ సెటిల్మెంట్ కేసులను పరిష్కరించేందుకు ఇంద్రజీత్ యాదవ్ ప్రత్యేక వెబ్సైట్ నడిపినట్లు తెలుస్తున్నది. 2024 డిసెంబర్లో మన్జీత్ దిగల్ అనే ఫైనాన్షియర్ హత్యకు గురయ్యాడు. రోహతక్‌లో ఆ మర్డర్ జరిగింది. ఆ హత్యలో తొలిసారి ఇంద్రజీత్ పేరు బయటకు వచ్చింది. సింగర్ రాహుల్ ఫజిల్పురియా ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనలోనూ యాదవ్ పేరు వెల్లడైంది. రోహిత్ షౌకీన్ హత్య కేసులోనూ అతనిపై ఆరోపణలు వచ్చాయి. యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటి వద్ద ఫైరింగ్ జరిగిన కేసులో హిమాన్షు భాను గ్యాంగ్ ఉన్నట్లు తేలింది. ఆ గ్యాంగ్‌తో యాదవ్‌కు లింకు ఉన్నట్లు గుర్తించారు. హర్యానా ఏఎస్ఐ సందీప్ కుమార్ సూసైడ్ నోట్లోనూ రావు ఇంద్రజీత్ యాదవ్ పేరున్నది.