Car accident : కారు అదపుతప్పి నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఒక మహిళ మాత్రం మునుగుతున్న కారులోంచి రూఫ్టాపైకి వచ్చి ప్రాణాలు దక్కించుకుంది. ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రం టెహ్రీ జిల్లా (Tehri district) లోని దేవప్రయాగ్ (Devaprayag) లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికిగల కారణాలపై ఆరా తీస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు దేవప్రయాగ్ మీదుగా వెళ్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. కారు నదిలో మునుగుతుండగా ఒక మహిళ మాత్రం విండోలోంచి రూఫ్‌టాప్ పైకి ఎక్కింది. ఇంతలో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ లోపు వారిని రక్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇంతలో పోలీసులు, డీఆర్ఎఫ్ టీమ్స్ ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదం జరిగిన చోట నది లోయలో ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టంగా మారింది. దాదాపు నాలుగైదు గంటలపాటు శ్రమించి భారీ క్రేన్ల సాయంతో నదిలో మునిగిన కారును వెలికితీశారు. ప్రాణాలతో బయటపడ్డ మహిళను ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం పూర్తిగా షాక్‌లో ఉందని పోలీసులు తెలిపారు.