మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తుండగా ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

బదోహి: రాష్ట్రం కాని రాష్ట్రంలో తమ ఇంటి సభ్యుడు చనిపోవడంతో ఓ కుటుంబం పుట్టెడు దుఃఖంలో మునిపోయింది. మృతదేహాన్ని స్వరాష్ట్రానికి తరలించేందుకు అంబులెన్స్ మాట్లాడి అదే అంబులెన్సులో నలుగురు కుటుంబసభ్యులు కూడా బయలుదేరారు. అయితే ఆ కుటుంబాన్ని విధి మళ్లీ వక్రించింది. వారు ప్రయాణిస్తున్న అంబులెన్స్ ప్రమాదానికి గురి కావడంతో మృతుడి కుటుంబసభ్యులు నలుగురితోపాటు అంబులెన్స్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతిచెందాడు. ఉత్తరప్రదేశ్‌లోని బదోహి జిల్లా గోపాల్‌గంజ్ ఏరియాలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం పశ్చిమబెంగాల్లోని అసన్సోల్కు వలస వెళ్లింది. అయితే ఆ కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతిచెందగా కుటుంబసభ్యులు మృతదేహాన్ని తీసుకుని అంబులెన్స్‌లో స్వరాష్ట్రానికి బయలుదేరారు. మంగళవారం ఉదయం యూపీలోని గోపాల్‌గంజ్ ఏరియాకు చేరుకునే సరిగా రోడ్డుపై దట్టంగా పొగమంచు కమ్ముకుని ఉంది. విజిబులిటీ సరిగా లేకపోవడంతో వారు ప్రయాణిస్తున్న అంబులెన్స్ ముందు వెళ్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మృతుడి వెంట ఉన్న అతని నలుగురు కుటుంబసభ్యులతోపాటు అంబులెన్స్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న యూపీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.