సిమ్లా, నవంబర్ 5: స్వతంత్ర భారతదేశ తొలి ఓటరు శ్యాం శరణ్ నేగి (106) కన్నుమూశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్హౌర్లో ఉన్న తన నివాసంలో శనివారం మరణించారు. కొద్ది రోజుల్లో జరుగనున్న హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా శ్యాం శరణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు ఆయన 34 సార్లు ఓటు హక్కును వినియోగించుకొని రికార్డు సృష్టించారు.
క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకున్న శ్యాం శరణ్.. ప్రజాస్వామ్య విలువలను కాపాడారని ఎన్నికల కమిషన్ తెలిపింది. నేటి యువతకు ఆయన ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడింది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొన్నది. మరోవైపు శ్యాం శరణ్ మరణంపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తదితరులు సంతాపం తెలిపారు.