(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): అది మధ్యప్రదేశ్. రాజధాని భోపాల్‌కు 117 కిలోమీటర్ల దూరంలో కడియా, గుల్ఖేడీ, హుల్ఖేడీ అనే మూడు గ్రామాలు ఉన్నాయి. ఈ పల్లెల్లోని పిల్లలు రాత్రి కాగానే ఓ బడికి వెళ్తారు. ‘నైట్ స్కూల్’ అనుకొంటే పొరపాటే. ఆ స్కూల్లో మంచి బుద్ధులు, సంస్కారం నేర్పించే పాఠాలు బోధించరు. దొంగతనాలు ఎలా చెయ్యాలి? దోపిడీలకు ఎలా పాల్పడాలి? దొంగతనం చేస్తుండగా పట్టుబడితే, ఎదుటివారిపై దాడి చేసి ఎలా తప్పించుకోవాలి? వంటి విషయాలు నేర్పిస్తారు. అదే ‘దొంగల బడి’. ఈ స్కూల్లో తమ పిల్లలను చేర్పించడానికి ఆయా గ్రామాల్లోని తల్లిదండ్రులు పోటీపడుతున్నారు.
దొంగతనాలకు సంబంధించి ఇచ్చే శిక్షణ ఏడాది పాటు ఉంటుంది. ఫీజు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకూ వసూలు చేస్తారు. కోర్సులో చేరే పిల్లల వయస్సు 12 ఏండ్ల నుంచి 17 ఏండ్ల మధ్య ఉండాలి. పట్టుబడినప్పటికీ, మైనర్లన్న కారణంతో ఎక్కువ శిక్ష పడకూడదనే ఈ వయస్సును నిర్ణయించారు. పిక్‌పాకెటింగ్, విలువైన వస్తువులున్న బ్యాగుల దొంగతనం, దోపిడీలు, పట్టుబడితే కొట్టి వేగంగా పరుగెత్తడం, పోలీసులకు దొరక్కుండా దాక్కోవడం వంటి వాటిల్లో ఈ కోర్సులో భాగంగా శిక్షణ ఇస్తారు.
పిల్లలకు శిక్షణ పూర్తయ్యాక.. శ్రీమంతుల ఇండ్లల్లో జరిగే ఖరీదైన పెండ్లిల్లు, శుభకార్యాలకు పిల్లలను అందంగా ముస్తాబు చేసి ఈ గ్యాంగ్ పంపిస్తుంది. బంగారం, వజ్రాల నగలు, డబ్బును దొంగిలించేలా ప్లాన్‌ను పక్కాగా అమలు చేస్తుంది. ఆగస్టు 8న జైపూర్‌లో జరిగిన ఓ హైదరాబాదీ ఫంక్షన్లో దొంగిలించబడిన రూ. 1.5 కోట్ల వజ్రాల హారం, గత మార్చిలో గురుగ్రామ్‌లో, గత డిసెంబర్లో ఢిల్లీలో వేర్వేరుగా జరిగిన బంగారం చోరీలు ఇలా ఇవన్నీ ఈ స్కూల్ పిల్లల పనే.
దొంగిలించిన తర్వాత పిల్లలు ఆయా వస్తువులతో సరాసరి గ్రామానికి చేరుకొంటారు. మరికొన్ని సందర్భాల్లో దగ్గర్లో ఏమైనా జాతర, వేడుకలు జరిగితే వాటిల్లో పాల్గొంటారు. స్వగ్రామాల్లోకి చేరుకోకముందే ఆ పిల్లలను పోలీసులు పట్టుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కష్టమే. దొంగతనాలు ఆ పిల్లల పనే అని తెలిసినప్పటికీ, పోలీసులు ఆ గ్రామాల్లోకి వెళ్లాలంటే జంకుతారు. కారణం.. పోలీసులు పొలిమేరల్లోకి వస్తున్నారని తెలియగానే, గ్రామాల్లోని మహిళలందరూ గుమిగూడి తరమికొడతారు.
ఈ ఊళ్ల నుంచి 300 మంది చిన్నారులు ఈ నేరపూరిత చర్యల్లో పాల్గొంటున్నారని, మొత్తంగా ఈ గ్రామాల్లో 2 వేల మంది క్రిమినల్స్ ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకూ ఈ గ్రామస్థులపై 8 వేల కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. పిల్లలను వినియోగించుకొంటున్నందుకు ఆయా పిల్లల ఫ్యామిలీలకు ఈ ముఠాలు ఏడాదికి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకూ చెల్లిస్తాయి. పేదరికం కారణంగానే గ్రామస్థులు తమ పిల్లలను ఈ నేరపూరిత రొంపిలోకి దింపుతున్నట్టు తెలుస్తున్నది.