Hyperloop | న్యూఢిల్లీ, డిసెంబర్ 6: భారతదేశ రవాణా వ్యవస్థలో సరికొత్త శకం మొదలుకాబోతున్నది. విమాన వేగంతో పోటీపడి ప్రయాణించే హైపర్‌లూప్ వ్యవస్థ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. చెన్నై సమీపంలో 410 మీటర్ల హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఐఐటీ మద్రాస్, రైల్వే శాఖ కలిసి ఈ ట్రాక్‌ను నిర్మించాయి. అధునాతన హైపర్‌లూప్ సాంకేతికతను దేశంలో అభివృద్ధి చేసేందుకు ఐఐటీ మద్రాస్‌లో ‘ఆవిష్కార్’ పేరుతో 76 మంది విద్యార్థులతో కూడిన ప్రత్యేక బృందం, ఐఐటీ మద్రాస్‌లోనే స్థాపించిన ‘టూటర్’ అనే స్టార్టప్ పని చేస్తున్నాయి. టెస్ట్ ట్రాక్ పూర్తి కావడంతో ఈ సాంకేతికతను పరీక్షించడం కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
హైపర్‌లూప్ పాడ్లు మధ్యలో ఎలాంటి స్టాప్‌లు లేకుండా ఆరంభ స్టేషన్ నుంచి గమ్యస్థానానికి ప్రయాణిస్తాయి. అందుకే వీటిని ఇంటర్ సిటీ ట్రాన్స్‌పోర్ట్‌గా ఏర్పాటుచేసేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన దేశంలో ముంబై-పుణె కారిడార్‌లో మొదటి హైపర్‌లూప్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రోడ్డు ప్రయాణానికి మూడు గంటలు పట్టే ఈ రెండు స్టేషన్ల మధ్య హైపర్‌లూప్‌లో 25 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఆ తర్వాత చెన్నై – బెంగళూరు, ఢిల్లీ – చండీగఢ్ మధ్య కూడా హైపర్‌లూప్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. పుణెకు చెందిన క్విన్‌ట్రాన్స్ హైపర్‌లూప్ అనే అంకుర సంస్థ కూడా హైపర్‌లూప్ కార్గో వ్యవస్థ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నది.
హైపర్‌లూప్ అనే హైస్పీడ్ రవాణా వ్యవస్థ ఆలోచన 2012లో మొదటిసారి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మదిలో పుట్టింది. తక్కువ పీడనం ఉండే ట్యూబ్(భారీ పైప్‌లైన్ లాంటిది)లో చిన్న పాడ్(రైలు బోగీ లాంటిది)ల ద్వారా ఈ ప్రయాణం కొనసాగుతుంది. ఒక్కో పాడ్‌లో 24 నుంచి 28 మంది ప్రయాణించవచ్చు. అయస్కాంతాలతో ఒత్తిడి కలిగించి, రాపిడి(ఫ్రిక్షన్) తగ్గించడం ద్వారా అత్యంత వేగంతో ఈ పాడ్లు ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణిస్తాయి. గంటకు 1,100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉండేలా హైపర్‌లూప్ వ్యవస్థను రూపొందిస్తారు. హైపర్‌లూప్ వ్యవస్థ ప్రయాణ వేగాన్ని గణనీయంగా పెంచడంతో పాటు ఇంధన అవసరాన్ని తగ్గిస్తుంది.