మోరన్, ఫిబ్రవరి 14: ఎన్నికలకు సిద్ధంగా ఉన్న అస్సాం రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. డిబ్రూగఢ్-మోరన్ జాతీయ రహదారిపై నిర్మించిన అత్యవసర రహదారిపై సీ-130జె ఆయన ప్రయాణించిన విమానం ల్యాండింగ్ కావడంతో ఈశాన్య భారతంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ సౌకర్యం (ఈఎల్ఎఫ్) ప్రారంభమైంది. సాధారణంగా భారీ వాహనాలు ప్రయాణించే ఈ హైవేపై 4.2 కి.మీ విస్తీర్ణాన్ని ఇప్పుడు విపత్తులు లేదా ఆకస్మిక పరిస్థితులలో సాయుధ దళాలకు అత్యవసర ల్యాండింగ్ స్ట్రీప్గా ఉపయోగపడేలా అప్‌గ్రేడ్ చేశారు. 2021లో రూ. 98.86 కోట్లతో రూపొందించిన నాలుగు లేన్ల ఈఎల్ఎఫ్ ప్రాజెక్టు సైనిక, పౌర విమానాల ల్యాండింగ్‌లు, టేకాఫ్‌లకు ఉపయోగపడేలా భారత వైమానిక దళ సమన్వయంతో నిర్మించారు. ఈ సందర్భంగా ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన 20 ఎయిర్‌షోలో హైవేపై విమానాల ల్యాండింగ్, టేకాఫ్, ఇతర విన్యాసాలను ప్రదర్శించారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఆరు లేన్ల వంతెనను, ఒక ఐఐఎంను, ఒక డాటా సెంటర్‌ను మోదీ తన పర్యటనలో భాగంగా ప్రారంభించారు.
మోదీజీ.. కాస్త మణిపూర్‌లోనూ పర్యటించండి!
ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్ర పర్యటనలో భాగంగా అస్సాంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వేళ సంక్షోభంతో అల్లాడుతున్న మణిపూర్ రాష్ర్టాన్ని కూడా పర్యటించాలని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు పలువురి దృష్టిని ఆకర్షించాయి. ‘మణిపూర్ కేవలం గంట ప్రయాణం మాత్రమే. దయుంచి మీరు అక్కడ కూడా పర్యటించండి. మీ కోసం మేము గువాహటి నుంచి ఇంఫాల్ వరకు విమానాన్ని సైతం బుక్ చేసాం. మీరు కేవలం ఆ విమానం ఎక్కి వస్తే చాలు.’ అని పేర్కొన్నారు.