న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఇనుములో హృదయంలో మొలిచెనే.. పాటను వినే ఉంటారు. ఇప్పుడు ఈ పాటను.. ‘హృదయంలో ప్లాస్టిక్ మొలిచెనే’ అని చదువుకోవాలేమో! ఎందుకంటే మనిషి హృదయంలో తొలిసారిగా మైక్రోప్లాస్టిక్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. గుండె కండరాల్లో తొమ్మిది రకాల ప్లాస్టిక్స్‌ను గుర్తించినట్టు చైనాకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. మనిషి రక్తంలో మైక్రోప్లాస్టిక్‌ను ఇదివరకే గుర్తించిన పరిశోధకులు.. ఇప్పుడవి గుండెకూ చేరినట్టు కనుగొన్నారు. శరీరంలోకి చొచ్చుకెళ్తున్న ఈ మైక్రోప్లాస్టిక్ భూతం.. కొత్త రకాల వ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉన్నది.
ప్లాస్టిక్ వినియోగం మానవాళికి ‘భస్మాసుర హస్తం’గా మారనున్నది. అత్యంత సూక్ష్మరూపంలోకి మారుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు గాలిలో కలిసిపోతున్నాయి. మానవులు గాలి పీల్చుకునేప్పుడు నోటిద్వారా, ముక్కు ద్వారా ప్రవేశిస్తున్న మైక్రోప్లాస్టిక్స్ గుండె వరకు చేరుకుంటున్నాయి. మానవుడి గుండెలో మైక్రోప్లాస్టిక్ చేరుతున్న సంగతిని బీజింగ్‌లోని ‘ఆంజెన్ హాస్పిటల్’ సైంటిస్టుల బృందం శాస్త్రీయ ఆధారాలతో కనుగొన్నది. బాటిల్స్, కాస్మిటిక్స్ రంగులు, పాలిస్టర్ బట్టలు, పీవీసీ పైపులు, కిటికీ ఫ్రేములు, ఫర్నిచర్, ఫుడ్ కంటైనర్లు, బ్యాగులు.. వీటన్నింటి నుంచి మైక్రోప్లాస్టిక్ వెలువడుతుంది.
ఎలాంటి ముప్పు ఏర్పడుతుంది?
సూక్ష్మజీవులు(బ్యాక్టీరియా) ఎలాగైతే మానవుడి శరీరంలోకి చేరుతున్నాయో, అలాగే మైక్రోప్లాస్టిక్స్ ప్రవేశిస్తున్నాయి. దీనివల్ల సరికొత్త క్యాన్సర్లబారిన పడే ప్రమాదమున్నది. కిడ్నీ, కాలేయం పనితీరు దెబ్బతింటుంది. అత్యంత పలుచని ప్లాస్టిక్ వాడకం మహా డేంజర్! దీని నుంచే మైక్రోప్లాస్టిక్స్ ఏర్పడతాయి. సముద్ర తీరంలో ఉండే ప్రమాదకర బ్యాక్టీరియాను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ‘మైక్రోప్లాస్టిక్’ మోసుకొస్తున్నది. ఇవి మానవుడి శరీరంలో చొరబడ్డాక.. రోగ నిరోధక వ్యవస్థకు లొంగవు. అంతుబట్టని రోగాల్ని సృష్టిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు.