Nirmala Sitharaman | కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా తొలుత ఆమె ప్రసంగిస్తూ.. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ అని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు వివరించారు. సామాన్యుల సాధికారతకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
‘ఈ బడ్జెట్ అమృతకాలంలో అంటే 75 ఏళ్ల స్వాతంత్ర్యపు తొలి బడ్జెట్. అన్ని వర్గాల అభివృద్ధికి దోహదపడే బడ్జెట్ ఇది. గడిచిన తొమ్మిదేళ్లలో భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. తలసరి ఆదాయం రెట్టింపైంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. ప్రస్తుత ఏడాదికి 7 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్థిక సర్వే చెబుతోంది. ప్రపంచంలో అత్యధికంగా 7 శాతం వృద్ధిరేటు ఉన్న ఆర్థిక వ్యవస్థ మనదే అవుతుంది. జీ20 ప్రెసిడెన్సీ మన దేశ పాత్రను బలోపేతం చేసే గొప్ప, విశిష్ట అవకాశం’ అని పేర్కొన్నారు.
‘సంస్కరణలపై దృష్టి సారించాము. పటిష్టమైన విధానాలతో 28 నెలల కాలంలో 80 కోట్లమందికి ఉచితంగా బియ్యం అందించాము. కరోనా సంక్షోభ సమయంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా చూశాము. ఇకపై ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగుతుంది. వంద కోట్ల మందికి 220 కోట్ల కొవిడ్ వ్యాక్సినేషన్ జరగడం విశేషం. సామాజిక భద్రత, డిజిటల్ చెల్లింపుల విషయంలో చక్కటి అభివృద్ధి సాధించాము. భారత ఆర్థిక వ్యవస్థ సరైన పంథాలో పయనిస్తోంది. స్థిరీకరణతో కూడిన అభివృద్ధి దిశగా భారత్ ముందుకు అడుగులు వేస్తోంది. మైనారిటీల సాధికారత, మహిళా సాధికారత, అందరికీ తగిన అవకాశాల కల్పనపై దృష్టి సారించాం. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంపై ప్రత్యేక దృష్టిపెట్టాం’ అని నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో వివరించారు.