న్యూఢిల్లీ, జూన్ 19: అగ్నిపథ్ పథకాన్ని సమర్థించుకునేందుకు బీజేపీ నేతలు చేస్తున్న అర్థరహిత, అవమానకరమైన వ్యాఖ్యల పరంపర కొనసాగుతున్నది. అగ్నివీరులకు బట్టలుతకడం, కటింగ్ చేయడం వంటి పనులు నేర్పుతామని, సైన్యం నుంచి బయటకువచ్చాక వారికి ఈ నైపుణ్యాలు ఉపయోగపడుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. తాజాగా బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆదివారం ఇండోర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ ఆఫీసులో సెక్యూరిటీ గార్డును నియమించాలి అనుకొంటే నేను అగ్నివీరులకే ప్రాధాన్యం ఇస్తాను’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. యువత సైన్యంలో చేరేది దేశానికి సేవ చేయడానికని, బీజేపీ ఆఫీసులకు సెక్యూరిటీ గార్డులుగా మారడానికి కాదని విపక్షాలు మండిపడ్డాయి. అగ్నిపథ్ కార్యక్రమం వెనుక అసలు ఉద్దేశాన్ని విజయవర్గీయ తేటతెల్లం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు.
సైనికులకిచ్చే గౌరవం ఇదేనా
విజయవర్గీయ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ‘యువత సైన్యంలో చేరేది దేశానికి సేవ చేయడానికే కానీ బీజేపీ కార్యాలయాలకు వాచ్మన్లుగా ఉండటానికి కాదు’ అన్నారు. యువతను, సైన్యాన్ని బీజేపీ అవమానించిందని ట్వీట్ చేశారు. అగ్నివీరులను సెక్యూరిటీ గార్డులుగా నియమించుకొంటామనడం సాయుధ బలగాలను చిన్నచూపు చూడటమే అని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. ‘అగ్నివీరులను పార్టీ ఆఫీసులకు కాపాలా పెట్టుకొంటారా.. ఇదేనా సైనికులకు బీజేపీ ఇచ్చే గౌరవం’ అని మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
క్షమాపణ చెప్పాలి..
విజయవర్గీయ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేత వరుణ్ గాంధీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘యువత రాత్రీపగలు కష్టపడి ఆర్మీలోకి వెళ్లేది తమ జీవితాంతం దేశానికి సేవ చేయడానికే తప్ప బీజేపీ ఆఫీసుకు సెక్యూరిటీ గార్డులుగా ఉండాలని ఎవరూ వెళ్లరు’ అని అన్నారు. విజయవర్గీయ సైనికులను అవమానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
నా ఉద్దేశం అది కాదు..
తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో విజయవర్గీయ వివరణ ఇచ్చారు. విమర్శలను విజయవర్గీయ ఖండించారు. తన వ్యాఖ్యలను ‘టూల్‌కిట్ గ్యాంగ్’ వక్రీకరించిందన్నారు. అగ్నివీరులు తమ నాలుగేండ్ల కాలం ముగిసిన తర్వాత వారు ఏ రంగానికి వెళ్లినా వాళ్లకే ప్రాధాన్యం ఇస్తారన్నదే తన ఉద్దేశం అని చెప్పుకొచ్చారు.
నేడు భారత్ బంద్
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సోమవారం ఆర్మీ ఉద్యోగార్థులు భారత్ బంద్ నిర్వహించనున్నారు. హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో ఆయా రాష్ర్టాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు రైల్వే కూడా అప్రమత్తమైంది. రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచింది.
‘కాంట్రాక్టు పద్ధతితో సైనికులనే ఆలోచన ప్రమాదకరం. దేశ యువత ఆశయాలు, వారి జీవితాలతో ఆడుకోవడం తప్పు. యువతకు ఉద్యోగాలే లేనప్పుడు, రాముడి గురించి మాత్రమే మాట్లాడడంలో ఉపయోగం లేదు. అర్థం లేని పథకాలకు అగ్నివీర్, అగ్నిపథ్ అని పేర్లు ఎందుకు పెట్టారు?’
-మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే
‘అగ్నిపథ్‌పై యువతకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ స్కీమ్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి. సైనికుడు కావాలని ఆశయంగా పెట్టుకొన్న వారిలో తీవ్ర ఆగ్రహం నెలకొని ఉన్నది. ఇది విద్యావంతులైన యువత కోసం తీసుకొచ్చిన నరేగా వంటి కార్యక్రమమా? లేక దీని వెనుక ఆరెస్సెస్ రహస్య ఎజెండా ఉందా?’
-ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్
‘జర్మనీలో నాజీల్లా సైన్యాన్ని నియంత్ర ణలోకి తీసుకొనేందుకు అగ్నిపథ్ బీజేపీ గురువు ఆరెస్సెస్ ‘రహస్య ఎజెండా’లో భాగంగా అనిపిస్తున్నది. అగ్నిపథ్ కాన్సెప్ట్‌ను ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు? పార్లమెంటరీ కమిటీ సిఫారసు ఉన్నదా? నాలుగేండ్ల తర్వాత మిగిలిన 75% మందిని దేశాన్ని శాసించేందుకు వినియో గించాలని ఆరెస్సెస్ ప్లాన్.’
-కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి