ముంబై: ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో చికిత్స పొందుతున్న 9 మంది నవజాత శిశువులను వెంటనే అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి అదుపులోనే ఉన్నదని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆ హాస్పిటల్ యాజమాన్యం పేర్కొంది. (Fire In Private Hospital) మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున జల్నా రోడ్ ప్రాంతంలో ఉన్న ఏషియన్ హాస్పిటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఎన్ఐసీయూలోని ఒక ఏసీ నుంచి పొగలు రావడాన్ని సిబ్బంది గమనించారు. అక్కడ ప్రత్యేక చికిత్స పొందుతున్న 9 మంది నవజాత శిశువులను వెంటనే బయటకు తరలించారు. పక్కనే ఉన్న జనరల్ వార్డులోని రోగులను కూడా ఖాళీ చేయించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది కూడా ఆ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు.
కాగా, ఇది చిన్న సంఘటన అని, ఎలాంటి అవాంఛనీయం జరుగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని ఆ ఆసుపత్రిని నిర్వహిస్తున్న డాక్టర్ షోయబ్ హష్మీ తెలిపారు. ముందు జాగ్రత్తగా తమ బృందం పక్కనే ఉన్న జనరల్ వార్డులోని రోగులతో పాటు నవజాత శిశువులను కూడా ఖాళీ చేయించినట్లు చెప్పారు. ఆసుపత్రి బృందం తక్షణ చర్యలు తీసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చిందని వివరించారు.
మరోవైపు జనరల్ వార్డు రోగులను తరువాత తిరిగి తీసుకువచ్చినట్లు డాక్టర్ షోయబ్ హష్మీ తెలిపారు. కుటుంబాల అంగీకారంతో నవజాత శిశువులను ఇతర ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు. ఆసుపత్రిని శుభ్రపరిచి, యధావిధిగా పనిచేసేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.