Mahua Moitra : కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీఎంసీ ఎంపీ (TMC MP) మహువా మొయిత్రా (Mahua Moitra) పై కేసు నమోదు చేశారు. బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి చొరబాట్లను నిరోధించడంలో విఫలమయ్యారంటూ అమిత్‌షాపై మహువా మొయిత్రా ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆ వ్యాఖ్యల నేపథ్యంలో మహువాపై కేసు నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు రాయ్‌పుర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, రాజ్యాంగ విరుద్ధమని ఫిర్యాదుదారు పేర్కొన్నాడు. 1971 సమయంలో రాయ్‌పుర్‌లోని మానా క్యాంప్ ప్రాంతంలో అనేక మంది బంగ్లాదేశీ శరణార్థులు స్థిరపడ్డారని, మహువా వ్యాఖ్యలు వారిలో భయాందోళనలు రేకెత్తించాయని తెలిపాడు.
అంతకుముందు పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ కొత్వాలీ పోలీస్ స్టేషన్లోనూ ఆమెపై ఫిర్యాదు దాఖలైంది. కాగా బంగ్లాదేశ్ నుంచి చొరబాట్ల విషయంలో మహువా మొయిత్రా ఇటీవల కేంద్రంపై విరుచుకుపడ్డారు. సరిహద్దు భద్రత విషయంలో కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకొంటోందని విమర్శించారు. బీజేపీ నేతలు పదేపదే చొరబాటుదార్ల గురించి మాట్లాడుతున్నారని, దేశ సరిహద్దులను పరిరక్షించే బాధ్యతను ఐదు భద్రతాదళాలు నిర్వర్తిస్తున్నాయని తెలిపారు.
అవన్నీ కేంద్ర హోంశాఖ పరిధిలోనే పనిచేస్తున్నాయని అన్నారు. ‘కేంద్ర హోం శాఖ, హోంమంత్రి సరిహద్దులను రక్షించలేకపోయినప్పుడు, చొరబాటుదార్లు దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రధాని స్వయంగా చెప్పినప్పుడు, ఆ తప్పు ఎవరిది..?’ అని మహువా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అమిత్ షాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.