చండీగఢ్: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యన సందర్భంగా జరిగిన భద్రతా ఉల్లంఘనకు సంబంధించి వంద మందికిపైగా గుర్తు తెలియని వ్యక్తులపై ఫిరోజ్‌పూర్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. వంద మందికి పైగా వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కుల్గర్హి స్టేషన్ హౌస్ ఆఫీసర్ బీర్బల్ సింగ్ తెలిపారు. అయితే ఆ వివరాలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. ‘సున్నితమైన ఈ కేసుకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయవద్దని మాకు ఆదేశాలు ఉన్నాయి. ప్రధాని పర్యటన భద్రతా లోపంపై దర్యాప్తు జరుగుతున్నది. ఇప్పటి వరకు ఏ వ్యక్తిని అదుపులోకి తీసుకోలేదు. అరెస్టు చేయలేదు’ అని చెప్పారు.
కాగా, ప్రధాని మోదీ కాన్వాయ్‌ను అడ్డుకున్నది తామేనంటూ భారతీ కిసాన్ యూనియన్ (క్రాంతికారి) కార్యకర్తలు బుధవారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఈ రైతు సంఘానికి చెందిన వారే అయి ఉంటారని తెలుస్తున్నది.
మరోవైపు, జనవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా ఉల్లంఘనలపై దర్యాప్తునకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ శుక్రవారం ఫిరోజ్‌పూర్ చేరుకున్నది. ఫిరోజ్‌పూర్-మోగా హైవేను ఆ కమిటీ పరిశీలించింది. ప్రధాని మోదీ భద్రతా లోపాలపై విచారణకు రాష్ట్ర పోలీసు చీఫ్ ఎస్ ఛటోపాధ్యాయతోపాటు ఫిరోజ్‌పూర్‌లోని డజనుకు పైగా సీనియర్ పోలీస్ అధికారులకు ఆ కమిటీ సమన్లు జారీ చేసింది.