Central Taxes | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: కేంద్ర పన్నుల్లో రాష్ర్టాలకు దక్కాల్సిన వాటాకు కోత పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదా? ఈ చర్య ద్వారా ద్రవ్యలోటును పూడ్చుకోవాలని ప్రయత్నిస్తున్నదా? అంటే విశ్వసనీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రాష్ర్టాలకు పన్ను వాటాను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర పన్నుల్లో రాష్ర్టాలకు 41 శాతం వాటా దక్కుతున్నది.
దీనిని ఒక శాతం తగ్గించి, 40 శాతానికి పరిమితం చేయాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తున్నదని తెలుస్తున్నది. ఈ మేరకు ఆర్థికవేత్త అరవింద్ పనగరియా నేతృత్వంలోని ఆర్థిక సంఘానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించనుందని సమాచారం. ఈ ప్రతిపాదనకు ఆర్థిక సంఘం ఆమోదం తెలిపితే 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. అక్టోబరు 31 నాటికి ఆర్థిక సంఘం తన సిఫార్సులను వెల్లడించనుంది. ఇందులోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
పన్ను వాటాను తగ్గించే నిర్ణయానికి మార్చి చివరి కల్లా మోదీ సారథ్యంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపి, ఆర్థిక సంఘానికి సిఫార్సు చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ద్వారా కేంద్రానికి అదనంగా రూ.35 వేల కోట్ల ఆదాయం సమకూరనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని పన్ను వసూళ్లను బట్టి ఈ అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో పన్ను వసూళ్లు పెరిగేకొద్దీ ఈ మొత్తం మరింత పెరుగుతుంది. రాష్ర్టాలకు పన్ను వసూళ్లలో వాటాను తగ్గించడం ద్వారా ద్రవ్యలోటును పూడ్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదని సమాచారం. 2024-25కు గానూ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో కేంద్రం ద్రవ్యలోటు 4.8 శాతంగా ఉంది. ఇదే సమయంలో రాష్ర్టాల ద్రవ్యలోటు దేశ జీడీపీలో 3.2 శాతంగానే ఉంది.
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల ఇప్పటికే తమకు నష్టం వాటిల్లుతున్నదని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా కొవిడ్-19 తర్వాత కేంద్రం సెస్సులు, సర్చార్జీలను భారీగా పెంచుతున్నది. వీటిల్లో రాష్ర్టాలకు వాటా దక్కదు. గతంలో మొత్తం పన్ను ఆదాయంలో సెస్సులు, సర్చార్జీల వాటా 9%-12% ఉండేది. ఇప్పుడు ఇది 15 శాతానికి పెరిగింది.
మరోవైపు తమ ఆదాయం పెంచుకోవడంలో జీఎస్టీ సైతం అడ్డంకిగా మారిందని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పన్నుల్లో రాష్ర్టాల వాటాను తగ్గిస్తే రాష్ర్టాలకు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. మరోవైపు రాష్ర్టాలకు ఇచ్చే గ్రాంట్లపై ఆంక్షలు విధించడం ద్వారా రాష్ర్టాలు ఉచితాలు అమలు చేయకుండా నిరుత్సాహపరిచేందుకు సైతం కేంద్రం మార్గాలు అన్వేషిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే గత ఐదేండ్లుగా ద్రవ్యలోటు గ్రాంట్లు రూ.1.18 లక్షల కోట్లు(2021-22) నుంచి రూ.13,700 కోట్లకు(2025-26 అంచనా) తగ్గాయి.