హైదరాబాద్, జూన్ 7: జమ్ము కశ్మీర్, లద్ధాఖ్ ప్రాంతాలను అనుసంధానించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ మరో చారిత్రాత్మక మైలురాయికి చేరుకున్నది. ఈ టన్నెల్ కీలకమైన తుది బ్రేక్‌త్రూ మంగళవారం ప్రారంభం కానున్నది. కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రెండు వైపుల నుంచి తవ్విన సొరంగాలను కలిపే ఈ ఘట్టంతో జోజిలా టన్నెల్ నిర్మాణం పూర్తవుతుంది. 13.153 కిలోమీటర్ల పొడవైన జోజిలా టన్నెల్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మితమవుతున్న సొరంగ రహదారి. అత్యంత పొడవైన సింగిల్-ట్యూబ్ ద్విముఖ రహదారి కూడా ఇదే. శ్రీనగర్- లేహ్ మధ్య హిమపాతం, తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా సంవత్సరంలో సగం కాలం మూసి ఉండే రహదారి సమస్యకు జోజిలా టన్నెల్ శాశ్వత పరిష్కారాన్ని చూపనున్నది.
సోనామార్గ్ సమీపంలోని బాల్తాల్ పశ్చిమ పోర్టల్ నుంచి ద్రాస్-కార్గిల్ ప్రాంతంలోని మీనామార్గ్ తూర్పు పోర్టల్ వరకు.. సముద్ర మట్టానికి సుమారు 11,578 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మిస్తున్నారు. పర్వతప్రాంత మౌలిక వసతుల అభివృద్ధిలో మునుపెన్నడూ ఎరుగని విజయంగా, దేశీయ రహదారి నిర్మాణంలో ఓ ఇంజినీరింగ్ అద్భుతంగా జోజిలా టన్నెల్ నిలిచిపోనున్నది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్హెచ్ఐడీసీఎల్) తరఫున హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ దీన్ని నిర్మిస్తున్నది.
హిమాలయ ప్రాంతంలోని సున్నితమైన భౌగోళిక పరిస్థితులు, క్షణక్షణం మారే వాతావరణం, మంచు, మారుతూ ఉండే రాతి నిర్మాణాలు.. ఇలాంటి సంక్లిష్ట వాతావరణంలో సాధారణ రోడ్డు నిర్మాణమే ఓ సవాల్. అలాంటిది 15 కిలోమీటర్ల పొడవునా సొరంగ మార్గాన్ని నిర్మించడం ఆషామాషీ విషయం కాదు. న్యూఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్‌ను ఉపయోగించి ఎంఈఐఎల్ దీన్ని నిర్మిస్తున్నది. ప్రధాన టన్నెల్తోపాటు అనుసంధాన రోడ్లు, వంతెనలు, రక్షణ నిర్మాణాలు, స్నో గ్యాలరీలు, నిల్‌గ్రార్ జంట సొరంగాలు కూడా ఈ జోజిలా ప్రాజెక్టులో భాగమే. ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీనగర్ లద్దాఖ్ మధ్య 365 రోజులపాటు నిరంతర రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
ద్రాస్, కార్గిల్, లేహ్ తదితర ప్రాంతాల ప్రజలకు ఉపయుక్తంగా ఉండనున్నది. ఏటా నిర్వహించే అమర్నాథ్ యాత్రకూ ఉపయోగపడనున్నది. కీలకమైన సరిహద్దు ప్రాంతాల్లో సైనిక రవాణా, లాజిస్టిక్స్ సామర్థ్యం మరింత బలోపేతం అవుతుంది. ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి, పర్యాటక రంగ ప్రోత్సాహానికి దోహదపడటమే కాకుండా, దేశ భద్రత పరంగా కూడా అత్యంత కీలకమైన మౌలిక సదుపాయంగా జోజిలా టన్నెల్ నిలుస్తుంది.