Bollywood | ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషికి చెక్ బౌన్స్ కేసులో గుజరాత్ లోని జాం నగర్ కోర్టు రెండేండ్ల జైలుశిక్ష విధించింది. అలాగే ఫిర్యాదు దారుకు రూ.2 కోట్ల నగదు చెల్లించాలని తీర్పు చెప్పింది. ఓ సినిమా నిర్మాణానికి రాజ్ కుమార్ సంతోషికి అశోక్ లాల్ అనే పారిశ్రామికవేత్త రూ.కోటి రుణం ఇచ్చారు. తర్వాత అశోక్ లాల్ కు సంతోషి రూ.10 లక్షల చొప్పున 10 చెక్ లు ఇచ్చినా.. ఆయన ఖాతాలో నగదు లేకపోవడంతో అవన్నీ బౌన్స్ అయ్యాయి. నిబంధనలకు అనుగుణంగా లీగల్ నోటీసులు ఇచ్చినా సంతోషి స్పందించకపోవడంతో అశోక్ లాల్ 2017లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
దీనిపై జాం నగర్ కోర్టు సీనియర్ సివిల్ న్యాయమూర్తి వీజే గాడ్వి విచారణ జరిపారు. రాజ్ కుమార్ సంతోషికి రెండేండ్ల జైలు శిక్ష విధించడంతోపాటు తీసుకున్న మొత్తానికి రెట్టింపు రూ.2 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. సంతోషి అప్పీల్ మేరకు హైకోర్టును ఆశ్రయించేందుకు తీర్పుపై నెల రోజులు స్టే విధించారు. ఘాయల్, ఘాతక్, దామినీ, అందాజ్ ఆప్నా ఆప్పా, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ తదితర సినిమాలను తెరకెక్కించిన సంతోషికి మూడు జాతీయ అవార్డులు, ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి.